CM Jagan on Vijayawada Rape Case : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల అలసత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించవద్దని.. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎంవో అధికారులకు జగన్ ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని.. ఆ కుటుంబానికి వెంటనే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
Compensation for Vijayawada Rape victim : మరోవైపు సీఎం జగన్ ఆదేశాలతో విజయవాడ ఆసుపత్రి సిబ్బందిపై వైద్యఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి వారిని పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆసుపత్రిలోని సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై శాఖాపరంగా దర్యాప్తు చేపట్టాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు చేపట్టే అవకాశముంది.
అధికారులపై వేటు: ఈ ఘటన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నున్న సీఐ హనీష్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్‌ను తక్షణమే సస్సెండ్ చేయాలని డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి... విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాను ఆదేశించారు. వెన్వెంటనే ఈ ఆదేశాలను అమలు చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు నున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించకుండా సిబ్బంది ఘోర నిర్లక్ష్యం చేయడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. బాధిత కుటుంబీకులే వెళ్లి తమ కుమార్తెను కాపాడాలని కోరుకునే దైన్యస్థితి నెలకొనడంపై రాజకీయ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇరుకు గదిలో సుమారు 30 గంటలకుపైగా బంధించి ఆమెపై అత్యంత పాశవికంగా ప్రవర్తించడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
సంబధిత కథనాలు: