Commercial Tax Vehicle Checkings Stopped: దేశవ్యాప్తంగా 2017 జులై నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తరువాత 2018 నవంబరు వరకు వాహన తనిఖీలు పూర్తిగా నిలిచి పోయాయి. జీఎస్టీ వచ్చే వరకు.. 17రకాల పన్నులు వసూలు చేస్తూ వచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ తరువాత ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ మాత్రమే అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్రాల్లోని వ్యాపారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన జరిగింది. కొత్త విధానం గాడిన పడే వరకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో వాహన తనిఖీలు దేశవ్యాప్తంగా ఆపేశారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ వచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారుల అక్రమాలు జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి వెళ్లడంతో.. కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది."ఈ వే బిల్లు" విధానాన్ని 2018 జూన్ నుంచి అమలులోకి తెచ్చింది. 50 వేలు మించి విలువ ఉన్న ఏ సరుకు రవాణా చేయాలన్నా "ఈ వే బిల్లు" తప్పనిసరి చేసింది జీఎస్టీ కౌన్సిల్. అయితే పర్యవేక్షణ కొరవడడంతో ఈ వే బిల్లులు జనరేట్ చేసుకున్నా.. ఒకే వే బిల్లును ఉపయోగించి ఎక్కువ సార్లు సరుకు రవాణా చేయడం, సరుకు విలువ కంటే తక్కువ విలువతో వే బిల్లు జనరేట్ చేయడం, వే బిల్లులో సరుకును బరువును తక్కువ చూపడం, ఒకచోటకు వే బిల్లు జనరేట్ చేసి మరొకచోటకు సరుకును తరలించడం....ఇలా రకరకాల ఎత్తులతో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. దీంతో సరుకు రవాణా జరిగే వాహనాలపై నిఘా, తనిఖీలు ఉండాలని భావించిన జీఎస్టీ కౌన్సిల్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2018 నవంబరు నుంచి వాహన తనిఖీలు రాష్ట్రంలో కూడా మొదలయ్యాయి.
మరో వైపు వ్యాపారి జనరేట్ చేసే ప్రతీ వే బిల్లుకు సరుకు రవాణా కావాల్సిన దూరాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించింది. దీంతో ఆ సమయం దాటి సరుకుతో వాహనం పట్టుబడితే...సరియైన కారణం లేనట్లయితే ఒకే వే బిల్లుపై ఎక్కువసార్లు సరకు రవాణా చేసినట్లుగా నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోడానికి అధికారాలు కల్పించింది. వాహన తనిఖీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేయాల్సి ఉండగా...కేంద్ర జిఎస్టీ అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల అధికారులు మాత్రం వాహన తనిఖీలపై దృష్టి సారించి రాష్ట్రంలోని 12 డివిజన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటుతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ప్రధానంగా వాహన తనిఖీలల్లో "వే బిల్లులు" లేకుండా సరుకు రవాణా అవుతుండడం, వాస్తవ విలువ కంటే తక్కువగా చూపడం, వాస్తవ బరువుకంటే తక్కువచూపడం, ఒకచోటకు వెళ్లాల్సిన సరుకు మరొక చోటకు తరలించడం లాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లొసుగులే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కొందరు దోచుకోడానికి బంగారు బాతుగుడ్డులా మారాయి. తనిఖీలు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వచ్చారు. గడిచి మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన వాహన తనిఖీల వివరాలను పరిశీలించినట్లయితే అధికారులు ఏ స్థాయిలో దోపిడీలకు తెరలేపారో తెలుస్తుంది.
2019-20లో 5849 ప్రత్యేక బృందాలు 7.83 లక్షల తనిఖీలు నిర్వహించి 6.73లక్షల వేబిల్లులు పరిశీలించారు. తద్వారా 6,938 వాహనాలను సీజ్ చేశారు. పలు రకాల లొసుగులను గుర్తించిన అధికారులు రూ.15.56 కోట్లు పన్నులు, మరో రూ.15.44 కోట్లు అపరాధ రుసుం మొత్తం కలిపి రూ.31 కోట్లుకుపైగా మొత్తాన్ని వసూలు చేశారు. అదే విధంగా 2020-21లో 6,914 ప్రత్యేక బృందాలు 6.30 లక్షల తనిఖీలు చేసి 5.91లక్షల వేబిల్లులు పరిశీలించారు. తద్వారా 3,531 వాహనాలను సీజ్ చేశారు. అక్రమ వ్యాపారుల నుంచి రూ.9.95 కోట్లు పన్నులు, మరో రూ.9.53 కోట్లు అపరాధ రుసుం మొత్తం కలిపి 19.48 కోట్లుకుపైగా మొత్తాన్ని వసూలు చేశారు. 2021-22లో దాదాపు ఏడువేల ప్రత్యేక బృందాలు 6.33లక్షల తనిఖీలు నిర్వహించి, 6.06 వే బిల్లులను పరిశీలించాయి. రూ.7.49 కోట్లు పన్ను, రూ.11.69 కోట్లు అపరాధ రుసుం మొత్తం కలిపి 19.19 కోట్లుకుపైగా మొత్తం వసూలు చేశారు.
మూడేళ్లలో నిర్వహించిన వాహన తనిఖీలను, తద్వారా వచ్చిన డబ్బు, సీజైన వాహనాల సంఖ్య తదితర వాటిని పరిశీలించినట్లయితే... మొదట 2019-20లో నిర్వహించిన వాహన తనిఖీలు ద్వారా 31 కోట్లు అక్రమ వ్యాపారుల నుంచి రాబట్టిన ప్రత్యేక బృందాలు ఆ తరువాత రెండేళ్లు వాహన తనిఖీలు నామకేవాస్తేగా కొనసాగాయి. అంతే కాదు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా ఇష్టారాజ్యంగా తనిఖీలు నిర్వహించాయి. గోడౌన్ల వద్దకు వెళ్లి తనిఖీలు చేయరాదని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉన్నా... అక్కడికెళ్లి కేసులు రాస్తామని బెదిరించి వసూల్లు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న అధికారులను సైతం వేధింపులకు గురి చేస్తుండడంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ పలు మార్లు సమీక్షలు నిర్వహించి తనిఖీ బృందాలను హెచ్చరించారు. తనిఖీ బృందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై నిఘా పెట్టాలని డివిజన్ల పరిధిలో జాయింట్ కమిషనర్లకు ఆదేశించినా ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో వాహన తనిఖీలు చేస్తూ దోచుకునే వారికి మరింత ఊతం ఇచ్చినట్లయింది.
రాష్ట్ర సరిహద్దు జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ మేనేజర్‌గా పని చేస్తున్న డీసీటీవో స్థాయి అధికారి ఒకరు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు పట్టుబడిన వాహనాలను విడుదల చేయించడంలో చక్రం తిప్పుతూ వచ్చారు. చివరకు ఆ అధికారిని తనిఖీలకు దూరంగా పెట్టాలని ఆదేశాలిచ్చినా.. దోపిడీలకు అడ్డుకట్ట పడలేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఏకంగా వాహన తనిఖీలనే నిలుపుదల చేసింది. ఇక్కడ ఉన్నత స్థాయిలో అధికారులు కింది స్థాయి అధికారులపై పర్యవేక్షణ చెయ్యకపోవడం, అజమాయిషీ అంతకంటే లేకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం లాంటి అనేక కారణాలతో వాహన తనిఖీలను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ శాఖాధికారులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: