హైదరాబాద్‌లో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పునరావాస కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు పురపాలక, డిస్కం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న 15 సబ్ స్టేషన్లు, 1080 ఫీడర్లను పునరుద్ధరించినట్లు దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి సీఎంకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,215కు 1207 ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించామని, మిగతా 8 నీటిలో మునగడం వల్ల మరమ్మతు చేయలేదని తెలిపారు. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1,145 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మతు చేసినట్లు వివరించారు.
భువనగిరి, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో 586 ట్రాన్స్ ఫార్మర్లు మూసీ నదిలో మునిగిపోయాయని రఘుమారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో దెబ్బతిన్న 1,299 స్తంభాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3,249 స్తంభాలు మరమ్మతు చేసినట్లు తెలిపారు. నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ చేయడం ప్రమాదకరమన్న సీఎం కేసీఆర్.. నీటిని తొలిగించిన ప్రాంతాలు, అపార్టుమెంట్లకే విద్యుత్ పునరుద్ధరించాలని సూచించారు. 10వేల ఆర్థికసాయం పండగకు ముందే అందేలా చూడాలని ఆదేశించారు. రోజుకు కనీసం లక్ష మందికి నగదు అందించేలా పనిచేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు
ఇవీచూడండి: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చర్యలు తీసుకోండి: కిషన్రెడ్డి