ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సుమారు 50 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. ఐపీఎస్ క్యాడర్‌పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు కేటాయింపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విస్తరణ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించండి..
తెరాస కార్యాలయ భూమి పూజ కార్యక్రమం కోసం దిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఐపీఎస్ క్యాడర్ పెంపుదల చేపట్టాలని సీఎం కోరారు. రాష్ట్రంలో 33 కొత్త రెవెన్యూ జిల్లాలు, 20 పోలీస్ జిల్లాలు, 9 పోలీస్ కమిషనరేట్లు, 7 పోలీస్ జోన్లు, 2 పోలీస్ మల్టీ జోన్లు ఏర్పాటు చేసినట్లు ప్రధానికి సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ పోస్టులను 139 నుంచి 195కి పెంచాలని కోరారు. మొత్తం క్యాడర్ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5 శాతం పెంపునకే పరిమితం కాకుండా.. 40 శాతం మేర పెంచాలని కోరారు. రాష్ట్ర పోలీస్ క్యాడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పంపినట్లు.. ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఐపీఎస్ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్ డీఐజీలు, మల్టీ జోనల్ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుందని... అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టెక్స్‌టైల్ పార్క్‌కు నిధులు ఇవ్వండి..
వరంగల్‌లో రెండు వేల ఎకరాల్లో అత్యాధునిక వసతులతో కూడిన టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు.. సీఎం కేసీఆర్ మరో లేఖను మోదీకి అందించారు. ఈ పార్క్‌లో దారం నుంచి దుస్తుల వరకు అన్ని రకాల జౌళి ఉత్పత్తులు తయారు చేయాలన్నదే లక్ష్యమని వివరించారు. గృహ వసతి, ఇతర పౌర వసతి సేవలు ఉండేలా పార్క్‌ను టౌన్‌షిప్ పద్ధతుల్లో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ముడి సరకుతోపాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున.. జౌళి రంగం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని లేఖలో వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పార్క్ కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు తెలిపిన సీఎం... మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. ఈ పార్క్ నుంచి ఒక్క చుక్క ద్రవవ్యర్థాలు కూడా ఉత్పత్తి కాకుండా.. కేంద్రీకృత శుద్ధికేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ డీపీఆర్ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ కోసం రూ.1,600 కోట్ల పెట్టుబడి అవుతుందని... కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. మిగిలిన వనరులను రాష్ట్రం సమకూర్చుకుంటుందని లేఖలో తెలియజేశారు.
నవోదయ విద్యాలయాలు కోరుతూ లేఖ..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానికి మరో లేఖను కేసీఆర్ అందించారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలున్నాయి. ఇక్కడ అవసరమైన భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉందని, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా.. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇంకో లేఖను ప్రధానికి ఇచ్చారు. వరంగల్ సమీపంలో రెండు వందల ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించి ఆమోదం తెలిపినా.. ఇప్పటి వరకు పార్లమెంటులో బిల్లు ఆమోదించడం, బడ్జెట్ కేటాయింపులు చేయనందున.. తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఐఐఎం మంజూరుకు వినతి
తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు కోరుతూ లేఖను ప్రధానికి అందించిన కేసీఆర్.. గత పదేళ్లలో కేంద్రం వివిధ రాష్ట్రాలకు 10 ఐఐఎంలు మంజూరు చేసిందని.. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్న కారణంగా తెలంగాణకు ఐఐఎం కేటాయించలేదని తెలిపారు. ఐఎస్‌బీ స్వీయ ఆర్థిక వనరులతో.. లాభాపేక్ష లేని ప్రైవేటు సంస్థగా నడుస్తోందని.. అసాధారణ ఫీజుల కారణంగా సాధారణ విద్యార్థులు అక్కడ చదువుకునే పరిస్థితి లేనందున ఐఐఎం ఏర్పాటు చేసేందుకు కేంద్ర విద్యాశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిధిలో రెండు వేల ఎకరాల్లో ఐఐఎంకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వివరించారు. అదే విధంగా కరీంనగర్‌లో పీపీపీ విధానంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని అదనపు లేఖను అందించారు. హైదరాబాద్, వరంగల్‌లో అనేక ఉన్నత సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నందున కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పీపీపీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూ కేటాయింపుతో పాటు.. ఐటీ సంస్థలు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన లేఖలో వివరించారు.
రహదారుల అనుసంధానానికి..
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల రహదారులు కేటాయించే అవకాశం ఉందని, ఈ రోడ్లను 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వెడల్పులో నిర్మించేందుకు అవకాశం కల్పించాలని కోరిన కేసీఆర్.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అనుసంధానం మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ.. విడివిడిగా లేఖలు అందించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం మంజూరు చేస్తున్న రహదారుల్లో భాగంగా.. కేంద్ర ప్రాయోజిత పథకం పద్ధతి కింద 60:40 నిష్పత్తిలో కాకుండా.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని ఇంకో లేఖలో విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్..
దిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్ తరహాలో.. హైదరాబాద్-నాగపూర్ మధ్య 585 కిలోమీటర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దీని ద్వారా దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న నాగపూర్‌ను అంతర్జాతీయ మల్టీమోడల్ కారోహబ్‌గా రూపొందించవచ్చన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నట్లు కేసీఆర్ వివరించారు. నాగపూర్-హైదరాబాద్ రైల్వే లైన్, హైదరాబాద్-భూపాలపట్నం మధ్య రోడ్డు అనుసంధానం ఉందని.. అందువల్ల కేంద్రమే హైదరాబాద్-నాగపూర్, వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక ప్రాజెక్టులను మంజూరు చేయాలని.. తద్వారా వెనుకబడిన ప్రాంతంలో ఉపాధి కల్పనపై ప్రభావం చూపడంతోపాటు.. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని కేసీఆర్ అందించిన లేఖలో విన్నవించారు.
యాదాద్రి ప్రారంభోత్సవానికి మోదీ..!
దేశ రాజధానిలో అన్ని రాష్ట్రాలకు కేటాయించిన విధంగానే.. రాష్ట్ర అధికార భవన్ 'తెలంగాణ భవన్' నిర్మించేందుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారని సీఎం కార్యాలయం వెల్లడించింది.
ఇదీచూడండి: MALLIKARJUN KHARGE:' ఆస్తులు లూఠీ చేయడం.. దోస్తులకు పంచిపెట్టడమే మోదీ పని'