రాష్ట్రంలో 2017 అక్టోబర్ ఒకటి నుంచి మొదలైన మద్యం విధానం ఈ నెల చివరికి ముగుస్తుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు రెండు వారాలుగా ఆబ్కారీ శాఖ కొత్త పాలసీపై కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై నూతన విధానాలపై చర్చించి రూపకల్పన చేశారు.
ఏపీ వ్యాపారుల కన్ను తెలంగాణపైనే...
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నందున అక్కడి వ్యాపారులంతా తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందువల్ల పోటీ నిలువరించేందుకు దరఖాస్తు రుసుము ఇప్పుడున్న లక్ష నుంచి లక్షన్నర లేక రెండు లక్షలు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అనుమతిస్తే ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల మేర తిరిగి ఇవ్వని రుసుముగా పెట్టనున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
లైసెన్స్ ఫీజు పెంచే అవకాశం
మద్యం దుకాణాల పక్కనే నిర్వహిస్తున్న పర్మిట్ గదులను అలాగే కొనసాగించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ఆధారంగా అమలు చేస్తున్న నాలుగు రకాల స్లాబ్‌లు కొనసాగించాలని భావిస్తున్నారు. లైసెన్స్ ఫీజు విషయంలో ఇప్పుడున్న 45 లక్షలు, 55 లక్షలు, 85 లక్షలు, కోటి పది లక్షలు మొత్తాల్లో మొదటి మూడు స్లాబుల మొత్తాలు పెంచే అవకాశాలు ఉన్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.
నేడో, రేపో గ్రీన్ సిగ్నల్
దరఖాస్తుల స్వీకరణ...లాటరీ, లైసెన్స్ ఫీజు వసూలు వంటి పలు కార్యకలాపాలు పూర్తిచేసేందుకు కనీసం రెండు వారాలు అవసరం. అందువల్ల ఒకటి రెండు రోజుల్లో నూతన మద్యం విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారు. వందకుపైగా కొత్త మండలాలు, పురపాలక సంఘాలు ఏర్పడినా... జనాభా ప్రాతిపదికనే మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇవాళో... రేపో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించి నూతన విధానానికి ఆమోద ముద్ర వేస్తారని సమాచారం.
- ఇదీ చూడండి : కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఆబ్కారీ కొరడా!