రాష్ర్టంలో కరోనా చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. 9 లక్షల61 వేల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయని తెలిపారు. ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 3600 పడకలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు సహా ఇతర పరికరాలన్ని అందుబాటులో ఉన్నాయని సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
గాంధీలో 247 మందే..
గాంధీ ఆసుపత్రి కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోయిందనే ప్రచారం అవాస్తవమని అధికారులు సీఎంకు వివరించారు. 2వేల మందికి పైగా చికిత్స అందించగలిగే సామర్ధ్యమున్న గాంధీలో.. ప్రస్తుతం 247 మంది మాత్రమే వైరస్ బాధితులున్నారని తెలిపారు. కొందరు నిరంతరం పిటిషన్లు వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తోందని, వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏ కారణంతో మరణించినా సరే, వారందరికీ కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలు సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 900 నుంచి 1000 మంది చనిపోతారని వారందరికీ పరీక్షలు కష్టమని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని అభ్యర్థించారు. వైద్యులకు వైరస్ సోకడం దేశవ్యాప్తంగా జరుగుతోందని...అది సహజమని ముఖ్యమంత్రికి తెలిపారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే..
కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలి తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. ఇతర జబ్బులున్న చాలా తక్కువ మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... ప్రజలు వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు. పాజిటివ్ కేసులు పెరిగినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే నడుచుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
కరోనా మరణాలుగా చెబుతున్నవన్నీ కేవలం వైరస్ వల్ల సంభవించినవి కాదన్న అధికారులు... దాదాపు 95 శాతం ఇతర కారణాలతో చనిపోయిన వారేనని తెలిపారు. తప్పుడు ప్రచారం వల్లే ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఒప్పంద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు మరోసారి అవకాశం