రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, కంటైన్‌మెంట్ జోన్ల, లాక్‌డౌన్ అమలుపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయాలు అమలవుతోన్న తీరును పరిశీలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. తాజా ఆదేశాలను రేపటి నుంచి అధికారులు అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలకు వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం