కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ఆధారాలతో బోర్డుల ముందు రాష్ట్ర వాదనలను సమగ్రంగా వినిపించాలని అధికారులు, ఇంజినీర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నీటిపారుదల అంశాలపై వరుసగా రెండో రోజు సమీక్ష నిర్వహించిన సీఎం... రెండు నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన ప్రాజెక్టులన్నీ పాతవేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరు చేయడం సహా గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ వీటిపై చర్చించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను పక్కాగా సిద్ధం చేసుకొని వాదనలు వినిపించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల రాష్ట్రానికి సవరించలేని అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేయాలని సూచించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11వేల క్యూసెక్కులు ఉంటే.. ఇప్పటికే 44వేలకు పెంచారని... దానికి సంబంధించిన అంశమే న్యాయస్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేయాలన్నారు. పూర్తి ఆధారాలను బోర్డు మందుంచాలని సీఎం స్పష్టం చేశారు.
ఇవీచూడండి: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ