ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, అధికారులతో సమావేశమైన సీఎం... సంస్థ స్థితిగతులపై చర్చించారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ... లాభాల బాట పడుతున్న తరుణంలో ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సంస్థను బతికించుకుంటామని స్పష్టం చేశారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగభద్రత ఇస్తున్నామన్న కేసీఆర్... వేలాది మంది విద్యుత్ ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరించినట్లు చెప్పారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసుకుంటూ వస్తున్నా... రాష్ట్ర సర్కార్ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటోందని పేర్కొన్నారు.
లాభనష్టాలను పట్టించుకోకుండా...
ఆర్టీసీని బతికించుకొని తిరిగి గాడిన పెట్టేవరకు తాను నిద్రపోనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఉన్నంత కాలం సంస్థను బతికించుకుంటానని తెలిపారు. సంస్థపై ఆధారపడిన ఉద్యోగుల కుటుంబాలతో పాటు ఆర్టీసీని... లాభనష్టాల గురించి ఆలోచించకుండా కాపాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం చెప్పారు. ఆర్టీసికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కార్మికులకు పెండింగులో ఉన్న రెండు నెలల జీతాలను తక్షణమే చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.
తిరిగి ప్రగతి పథం పట్టాలంటే...
కరోనా భయంతో, వ్యక్తిగత వాహనాల వాడకం పెరగడం వల్ల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని... సంస్థ తిరిగి నష్టాల బారిన పడిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కష్టాలను దాటుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం... ముందు పరిస్థితిని తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై విశ్లేషించుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనంతర పరిస్థితుల నుంచి ఒక్కో వ్యవస్థ గాడిన పడుతోందని... జనసంచారం క్రమక్రమంగా పుంజుకుంటోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆర్టీసీని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాలో లోతుగా చర్చించాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా నగరానికి జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులకు రవాణా భరోసా లభిస్తుందని... అందుకోసం సిటీ బస్సుసర్వీసులను యాభై శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కార్గోతో లాభాలే...
ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో రైల్వే తరహాలో ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన కొద్దికాలంలోనే మిలియన్ పార్శిళ్లను రవాణా చేసిన రికార్డును ఆర్టీసీ సొంతం చేసుకోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ, అధికారులను అభినందించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అదనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని మంత్రి, అధికారులు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగభద్రత అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.