తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో... తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ సహా మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించిన KCR... నీటిపారుదల శాఖను జలవనరుల శాఖగా మారుస్తున్నట్టు ప్రకటించారు. రోజుకు గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసేలా నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలన్నారు.
ఒకే గొడుగు కిందకు..
గొప్ప వ్యవసాయ తెలంగాణగా మారుతున్న వేళ... సాగునీటి రంగం ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలన్న సీఎం... వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలన్న కేసీఆర్... వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్‌ను బాధ్యునిగా నియమించాలని చెప్పారు. ఈఈ, డీఈల పరిధులను ఖరారు చేయాలని సూచించారు. ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, జలాశయాలు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు సాగునీటికి సంబంధించిన అన్నీ సీఈ పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.
అవసరమైతే కొత్త పోస్టులు
ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపటమే ప్రాధాన్యతగా పెట్టుకున్నట్టు సీఎం తెలిపారు. ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో కచ్చితమైన లెక్కలు తీసి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు సిబ్బంది, అధికారులు జాబితా తయారు చేయాలన్నారు. అవసరమైతే మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్సీ ఆపరేషన్స్ ఖచ్చితంగా ఉండాలన్న కేసీఆర్... పునర్వ్యవస్థీకరణలో ఎంత మంది ఈఎన్సీలు ఉండాలన్న విషయాన్ని నిర్ధారించాలని చెప్పారు. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల వద్ద ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించి అందుకు అనుగుణంగానే నిర్వహణ జరగాలని స్పష్టం చేశారు.
అంచనా వేయండి
ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని పంప్ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలని ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి... ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల జలాశయాల వద్ద గెస్టు హౌజులు, సీఈలకు వారి పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని తెలిపారు. అధికారులు రూపొందించిన ముసాయిదాకు కొన్ని మార్పులు చేసిన ముఖ్యమంత్రి... మరోసారి వర్క్ షాపు నిర్వహించి మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం