రాష్ట్రంలో కరోనా నియంత్రణాచర్యలు, లాక్‌డౌన్ అమలు, బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స, టీకాలు,సంబంధిత అంశాలపై....... ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పడుతోందన్న సీఎం.. ప్రజాశ్రేయస్సు, ఆరోగ్యరక్షణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కఠినంగా అమలు అవుతోందన్నారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు.. ద్విముఖవ్యూహం అమలు చేయాలని ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేనట్లుగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తోందని... సర్వే కొనసాగిస్తూ వ్యాధి లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించాలని... ముఖ్యమంత్రి తెలిపారు. అదేసమయంలో అనుమానితులకు పరీక్షలు నిరాకరించకూడదన్న ఆయన ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రాథమిక వైద్యకేంద్రాల వద్దకు వచ్చే వారందరికీ పరీక్షలు చేయాలని స్పష్టంచేశారు. కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని నిర్ణయించినందున తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను..50 లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి పీహెచ్‌సీలు సహా అన్ని పరీక్షా కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచేలా చర్యలు తీసుకోవాలని. ఇవాళ్టి నుంచి పెంపు అమలుచేయాలని తెలిపారు. వైద్యకేంద్రాలకు కావాల్సిన సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చెప్పారు.
ఎంతటి ఖర్చుకైనా వెనకాడొద్దు..
జిల్లా వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. నియామకాల ప్రక్రియ, ఆసుపత్రుల్లో మందులు, మౌలికసదుపాయాలపై నివేదిక తెప్పించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును.. కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని... ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని మరోమారు స్పష్టం చేశారు. అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని..... రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 600 మెట్రిక్ టన్నులకు పెంచేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. కొవిడ్ టీకా రెండో డోస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో వారికి సరిపడా వాక్సిన్లను తక్షణమే సరఫరా చేసేలా ఉత్పత్తిదారులతో మాట్లాడాలని.. టాస్క్‌ఫోర్స్ చైర్మన్, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సత్ఫలితాలు సాధిస్తున్నాం..
ఇప్పటికే రాష్ట్రంలో కరోనా శాతాన్ని తగ్గించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నామన్న కేసీఆర్... కట్టడి శాతాన్ని ఇంకా పెంచేందుకు కృషిచేయాల్సిన అవసరముందని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పడుతున్నా... 5 శాతానికి తగ్గించినప్పుడే వైరస్‌పై మీద విజయం సాధించినవారమవుతామని అన్నారు. ఆ దిశగా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. దిల్లీ, మహారాష్ట్రలో కరోనాను సమర్థంగా నియంత్రించారని.. ఇంకా ఏ రాష్ట్రాలు సమర్ధ కట్టడికి అమలుచేస్తున్న కార్యాచరణను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌తో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దిల్లీలోని అర్బన్ కేంద్రాల్లో చేపట్టిన చర్యలు అధ్యయనం చేయాలని... అవసరమైతే వైద్య బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి రావాలని పేర్కొన్నారు.
మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి..
మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని..... ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. కరోనానంతర బ్లాక్ ఫంగస్ వ్యాధి కట్టడి కార్యాచరణపైనా... సమావేశంలో సీఎం చర్చించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో150, ఈఎన్టీ ఆసుపత్రిలో 250 పడకలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.రద్దీని తట్టుకునేలా గాంధీలో మరో 160, సరోజినీదేవి ఆస్పత్రిలో 200 పడకలు తక్షణమే సిద్ధం చేయాలన్నారు. అవకాశం ఉన్న చోట ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో 1100, జిల్లాల్లో 400 పడకలన బ్లాక్‌ఫంగస్ చికిత్స కోసం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం అవసరమయ్యే ఔషధాల కోసం తక్షణమే ఆర్డర్ ఇవ్వాలన్న ఆయన.. అందుబాటులో ఉన్న ‘‘పోసకోనజోల్ " స్టాక్ తక్షణమే పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడికి కావాల్సిన వైద్యులను... యుద్ధప్రాతిపదికన నియమించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.
10 కోట్ల జనాభాగా అంచనా వేసుకోవాలి..
కరోనా, బ్లాక్‌ఫంగస్ చికిత్సకు పక్కరాష్ట్రాల నుంచి వస్తున్నారన్న సీఎం... వారికి చికిత్స అందించక తప్పేలా లేదని చెప్పారు. రాష్ట్ర జనాభా 4 కోట్లే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో 10 కోట్లుగా అంచనా వేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ దృష్ట్యా కొన్నిశాఖల ఖర్చు పెరుగుతోందని.. మరికొన్ని శాఖల వ్యయం తగ్గుతుందన్న ముఖ్యమంత్రి... ఆయాశాఖలను గుర్తించి హోం, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఆ విషయంపై సమీక్ష నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణకు మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదన్న సీఎం... ఇందుకు ఎన్ని కోట్ల వ్యయం అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అవసరమైతే అప్పు తెచ్చైనా కరోనా కట్టడికి సర్కార్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యవ్యవస్థ, యంత్రాంగంతో పాటు ప్రైవేట్ వైద్యరంగం, ఇతర రంగాలు మానవతా దృకృథంతో స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్