రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు అంబేడ్కర్ ఆశయాలు, కార్యాచరణ మహోన్నతమైనవని సీఎం అన్నారు. దేశానికి బాబాసాహెబ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ బద్దంగా సాధ్యమైందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితోనే సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేలా అమలు చేస్తున్న ఆర్థిక, సామాజిక విధానాల్లో బాబాసాహెబ్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక ప్రగతినిధి చట్టం చేశామన్న కేసీఆర్... ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న టీఎస్ప్రైడ్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు సాధిస్తున్న అద్భుత విజయాలను గుర్తు చేసుకున్న సీఎం... ప్రపంచంతో పోటీ పడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ యువత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుండడాన్ని సమాజం ప్రశంసిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కులరహిత సమాజానికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.