తెలంగాణను మాదకద్రవ్యాలరహిత రాష్ట్రంగా మార్చేందుకు నడుంబిగించిన ప్రభుత్వం.. అందుకు తగిన చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్, పోలీసు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో మత్తుమందులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను దాదాపు గంటన్నరపాటు సమీక్షించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా విస్తరించిందని... కట్టడికి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని.. పోలీసు, ఎక్సైజ్ శాఖలను ప్రశ్నించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు చెందిన అధికారులు ఇచ్చిన నివేదికలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిందని.. గ్రామ, గ్రామానికి విస్తరించిందని... యువత వ్యవసనాలకు గురై వారి భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను దృష్టిలో ఉంచుకుని కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బయటి రాష్ట్రాలకు సరఫరా..
రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్ కర్నూలు, బూపాల్‌పల్లి, వరంగల్ రూరల్, పరకాల తదితర ప్రాంతాల్లో గంజాయి సాగు అక్కడక్కడ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు నివేదించారు. అదేవిధంగా నారాయణఖేడ్, అసిఫాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో గుడుంబా తయారీ, వాడకం జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గంజాయి సాగు అధికంగా ఉందని... అక్కడ నుంచి బయట రాష్ట్రాలకు తరలుతోందని... ఖమ్మం జిల్లా అశ్వారావు పేట, సూర్యాపేట మీదుగా హైదరాబాద్, చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలిపోతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ అంతర్ పంటగా, వ్యక్తిగత వాడకానికి మిద్దెల మీద కూడా గంజాయి సాగు అవుతున్నట్లు పేర్కొన్న సీఎం... ఇలాంటివి కూడా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బయట రాష్ట్రాల నుంచి గంజాయి కానీ.. మాదకద్రవ్యాలు కానీ.. రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గంజాయి నిరోధం బాధ్యత వాళ్లదే..
పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పని చేసేందుకు రాష్ట్ర స్థాయిలో అదనపు డీజీ లేక ఐజీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని, జిల్లా స్థాయిలో ఎక్సైజ్ అధికారి, కలెక్టర్, ఎస్పీ లేక సీపీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గంజాయి సాగు, గుడుంబా తయారీ నిరోధం బాధ్యత పూర్తిగా ఎక్సైజ్ శాఖనే తీసుకోవాలని, గుడుంబా వాడకం, బయట రాష్ట్రాల నుంచి రాకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖతో కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గంజాయి, మాదకద్రవ్యాలు రాకుండా చూసేందుకు అవసరమైన చోట సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని... ఇవి నామ్కేవాస్తేగా కాకుండా గట్టిగా పని చేస్తేనే ఫలితం ఉంటుందని హెచ్చరించారు.
23 సమావేశంలో స్పష్టత..
గంజాయి, మాదకద్రవ్యాలు, గుడుంబా నిరోధానికి కార్యాచరణ రూపకల్పనకు రేపు కానీ.. ఎల్లుండి కానీ.. ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 23న కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఉండడం వల్ల ఆ రోజున గంజాయి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: