రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ఆరు వేల కోట్లతో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గొర్రెల యూనిట్ ధరను లక్షా 75 వేలకు పెంచాలని నిర్ణయించిన సీఎం... ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మందికి కూడా పెంచిన ధరే వర్తింపజేయాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువకులకు చేపల పెంపకం సొసైటీల్లో అవకాశం కల్పించాలన్న కేసీఆర్... సముద్ర ప్రాంతాలకు దూరంగా ఉన్న దేశంలోని పలు పట్టణాలు, నగరాలకు రాష్ట్రం నుంచి చేపలు ఎగుమతి చేయాలని చెప్పారు.
రూ.6000 కోట్ల కేటాయింపు...
కులవృత్తులు చేసే బీసీ వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ దఫా పంపిణీ కోసం 6000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపిన సీఎం.. అవసరమైన నిధులు సమకూర్చాలని ఆర్థికశాఖకు స్పష్టం చేశారు. మొదటి విడత గొర్రెల పంపిణీ కోసం 5000 కోట్లు ఖర్చు చేశామని, రెండో విడత 6000 కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం మొత్తంగా 11,000 కోట్లు కేటాయించినట్లవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. యూనిట్ ధరను లక్షా 25 వేల రూపాయల నుంచి లక్షా 75 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే డీడీలు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గొర్రెల జనాభాలో రాష్ట్రం రాజస్థాన్‌ను అధిగమించి దేశంలోనే మొదటిస్థానానికి చేరుకొందని... గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సీఎం తెలిపారు.
చేపల పెంపకంలో అద్భుతాలు..
చేపల పెంపకం వృత్తి నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని... రాష్ట్రంలో మత్స్యసంపద రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోందని అన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో జలాశయాలు, చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయని... ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను అందిస్తోందని కేసీఆర్ వివరించారు. ప్రతి గ్రామంలోని చెరువులో మత్స్యసంపద పెద్దఎత్తున అభివృద్ధి చెందిందని, ఇతర ప్రాంతాల నుంచి చేపల దిగుమతి తగ్గిందని అన్నారు. సముద్ర ప్రాంతాలకు దూరంగా ఉన్న దేశంలోని పలు పట్టణాలు, నగరాలకు చేపల ఎగుమతి కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. చేపల పెంపకం సొసైటీల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని తెలిపారు.
సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు...
ఉత్తర భారతదేశానికి భిన్నంగా కులవృత్తులన్నింటినీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణ ప్రత్యేకత అన్న సీఎం... దాన్ని గుర్తించి వారికి అండగా ప్రభుత్వం నిలిచిందని చెప్పారు. వారిని ఆదుకోవడమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన కులవృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం చేస్తున్న కృషితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్ఠమవుతోందన్నారు. సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని, అనుబంధ కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వంసం చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గ్రామీణ జీవన ముఖచిత్రం కుప్ప కూలిపోయిందని తెలిపారు. మిషన్ కాకతీయతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం... సాగునీటి వ్యవస్థలను మెరుగుపరిచిందని వివరించారు. గ్రామానికి ఆదెరువుగా ఉన్న చెరువును నిత్యం నీటితో సజీవంగా ఉంచి, ధ్వంసమైన కులవృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందన్నారు. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
కేటీఆర్ కార్యదక్షతతో...
వ్యవసాయం తరువాత పెద్దఎత్తున ఆధారపడిన కుల వృత్తి అయిన చేనేతరంగాన్ని నమ్ముకొన్న పద్మశాలీలు ఒకనాడు బ్రాహ్మణులతో సమానంగా గౌరవాన్ని పొందేవారని కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో ఆ వర్గం ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలైపోయిందని అన్నారు. వలస పాలకుల నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి... ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొందని ముఖ్యమంత్రి అన్నారు. గాయాల పాలైన చేనేత వృత్తి గాడిన పడుతోందని వ్యాఖ్యానించారు. కల్లుగీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు సహా నాయీ బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని ప్రభుత్వం అభివృద్ది పథాన నడిపిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
మంత్రి తలసాని కృతజ్ఞతలు...
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఇప్పటి వరకు 3,76,223 యూనిట్ల దాకా గొర్రెలు పంపిణీ పక్రియ పూర్తి చేశామని చెప్పారు. లబ్ధిదారుల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాయితీపై గొర్రెల పంపిణీ కోసం 4702.78 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించిందని ప్రకటించారు. రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో 7,61,898 మంది గొల్ల, కురుమలు సభ్యులుగా ఉన్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 1.37 కోట్ల గొర్రె పిల్లలు జన్మించగా గొల్ల, కురుమలకు 6,850 కోట్లు ఆదాయం సమకూరిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభించనున్న 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద 6 వేల కోట్లు వ్యయంతో సుమారు 3.81 మంది లబ్దిదారులకు జీవాల యూనిట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. పెరిగిన అన్ని రకాల ధరల నేపథ్యంలో ఒక యూనిట్ ధర 1.25 లక్షల నుంచి 1.75 లక్షల రూపాయల వరకు పెంచేందుకు ఆమోదించిన సీఎంకు గొల్ల, కురుమల తరపున తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.