రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్, అదనపు డీజీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ప్రమోద్ కుమార్, తదితరులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందేందుకు కొందరు అనేక కుట్రలు చేస్తున్నారన్నారు సీఎం. సామాజిక మాధ్యమాలు, మార్ఫింగ్ ఫొటోలు, మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నా.. శాంతికాముకులైన హైదరాబాద్ ప్రజలు వాటిని పట్టించుకోలేదని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎన్ని మాటలు మాట్లాడినా... ప్రజల నుంచి స్పందన రావడం లేదని తెలిపారు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్లో నడవవని తెలియటం వల్ల మరింత దిగజారి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వానికి సమాచారముంది...
కరీంనగర్లోనో, వరంగల్లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. తద్వారా ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్న సీఎం... పెద్ద ఎత్తున గొడవలు సృష్టించి జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేసేందుకు ప్రణాళిక రచించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని కేసీఆర్ తెలిపారు.
మొదటి నుంచి రాజీలేని ధోరణి...
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో శాంతిసామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం... ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తుల పట్ల, మాఫియాల పట్ల, విచ్ఛిన్నకర శక్తుల పట్ల తెరాస ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారన్నారు. ప్రభుత్వ చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నందునే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరు వచ్చిందన్న ముఖ్యమంత్రి... పెద్దఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయని అన్నారు.
అధికార పార్టీ సభ్యులైనా వదలొద్దు...
3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటీ 60 లక్షల జనాభా ఉన్న నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత అని వెల్లడించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండి ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించడం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను పణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదన్న కేసీఆర్... ఘర్షణలు సృష్టించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎంతటి వారైనా, అధికారపార్టీ సభ్యులైనా వదలొద్దని... ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలని స్పష్టం చేశారు.
రెచ్చగొడితే రెచ్చిపోవద్దు...
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి మాటలు విని రెచ్చిపోవద్దని యువతకు సూచించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. తమ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.పంటను ఇళ్లలో నిల్వ చేయడం కూడా మార్కెట్లకు పత్తి పెద్దగా రాకపోవడానికి కారణమని తెలుస్తోంది.
పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని... ఎట్టి పరిస్థితుల్లోనూ అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.