రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కలెక్టర్లు, డీపీవోల ఆధ్యర్యంలో గ్రామాల్లో జరగాల్సిన పనులపై సీఎం మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యం ఉన్నాయన్నారు. గ్రామాలు ఇప్పుడు బాగుపడకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలన్నా వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సూచించారు.
వ్యవసాయ కూలీలకు ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పన, అవసరమైన పనులు చూసుకునేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజూ గ్రామం శుభ్రం కావాల్సిందేనని, అధికార యంత్రాంగంలో ఎవరికైనా అంతకు మించిన పని మరొకటి లేదని స్పష్టం చేశారు. రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: 'రైతుబంధు సాయంలో చిన్నరైతులకు ప్రాధాన్యం'