CM KCR in Christmas Celebrations: ప్రపంచంలో ఎంతో విభిన్నమైన, అందమైన దేశం భారత్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్నిస్తూ.. అన్ని పండుగలను ఘనంగా జరుపుకునే పవిత్రమైన భూమి అని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. భయంకరమైన కరోనా వల్ల గతేడాది క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేకపోయామన్నారు. మళ్లీ ఇలా అందరినీ కలుసుకుని పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.
దేశంలోనే అత్యున్నత స్థానంలో తెలంగాణ..
రాష్ట్రంలో అన్ని మతాలకు సమానమైన గౌరవం, ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ మతం తోటివారిని ప్రేమించాలని బోధిస్తోందని గుర్తుచేశారు. ఎదుటివారిని ప్రేమించటమే అత్యుత్తమ మతమని వివరించారు. ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించగలగాలన్నారు. మతం ఉన్మాదస్థితికి వెళ్లినప్పుడే ప్రమాదమని హెచ్చరించారు. క్రిస్మస్ చేయాలని, బోనాలు చేయాలని, బతుకమ్మ జరపాలని తనను ఎవ్వరు అడగకపోయినా అందరికోసం జరిపిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అందరి సహకారం వల్లే నేడు తెలంగాణ.. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉందన్నారు.
వచ్చే కేబినెట్లో సమస్యల పరిష్కారం..
"మహాత్ముల త్యాగాలే మనల్ని ఈ స్థితికి తీసుకోవచ్చాయి. ప్రతి మతం కూడా తోటివారిని ప్రేమించాలని చెప్తోంది. ఇతర మతస్థులపై దాడి చేయడం గొప్ప విషయం కాదు. మతం ఉన్మాద స్థాయికి చేరితేనే ప్రమాదం. ఎదుటివారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. బోనాలు, రంజాన్, క్రిస్మస్ జరపాలని ఎవరూ నన్ను కోరలేదు. రాష్ట్రంలో అన్ని మతాల వారికి రక్షణ ఉంటుంది. అందరూ క్షేమంగా ఉండాలి... అందరి బాధ్యత ప్రభుత్వానిది. ఎవరైనా మతపరమైన దాడులకు పాల్పడితే సహించేది లేదు. అర్థం చేసుకుంటే... అనుభవిస్తే ఇండియా గొప్ప దేశం. ప్రపంచంలో విభిన్నమైన, అందమైన దేశం భారత్. భారత్‌లో అన్ని మతాల పండుగలు ఘనంగా జరుగుతాయి. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని పండుగలు మన దేశంలో జరుపుకోవచ్చు. ఎవరూ ఎవరికి తల ఒగ్గాల్సిన అవసరంలేదు. కరోనా తర్వాత చాలా లక్ష్యాలు సాధించాం. ఆర్థికంగా ముందుకు వెళుతున్నాం. ఏసు దీవెనలతో అందరూ చల్లగా ఉండాలి. కరోనా మహమ్మారి నుంచి దేవుడి దయవల్ల అందరూ బయటపడాలి. క్రిస్టియన్లకు ఉన్న సమస్యలను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించాం. ఇంకా ఉన్న సమస్యలను గుర్తించి వచ్చే కేబినెట్లో చర్చించి పరిష్కారం చేస్తాం." -కేసీఆర్, సీఎం
ఇదీ చూడండి: