కరోనా కష్టాలు అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా సహకరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న భేటీకి మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులు హాజరయ్యారు. మెట్రో రైల్ ప్రస్తుత పరిస్థితులు, విస్తరణ ప్రణాళికలపై సీఎం వారితో చర్చించారు.
కరోనా వల్ల నష్టపోయాం
కరోనాతో వచ్చిన నష్టాల గురించి ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. నష్టాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో అన్వేషిస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రోకు అనతికాలంలోనే ఆదరణ పెరిగిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సురక్షిత ప్రజారవాణా వ్యవస్థగా ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మెట్రోను మరింత విస్తరిస్తాం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేశాయని సీఎం కేసీఆర్ అన్నారు. తక్కువ వ్యవధిలోనే దినాదినాభివృద్ధి చెందుతున్న నగరానికి మెట్రో అవసరం చాలా ఉందన్నారు. భవిష్యత్తులో మెట్రోను మరింత విస్తరించాల్సి ఉందని సీఎం తెలిపారు. మెట్రోకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ అధ్యక్షతన కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. రాజీవ్ శర్మ, నర్సింగ్ రావు, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ కమిటీలో సభ్యులుగా ఉంటారని సీఎం అన్నారు. మెట్రోను ఆదుకునేందుకు తగిన అంశాలను పరిశీలించి త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇదీ చూడండి: గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్