పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధనే ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించినట్లు పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలు తెలిపారు. ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను పీఆర్టీయూ టీఎస్ నేతలు కలిశారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పునఃప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని.. ప్రస్తుతం 9, 10 తరగతులకే ఆన్లైన్ బోధన చేపట్టాలని కోరారు. రోజుకు సగం మంది ఉపాధ్యాయులకే హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. పాఠశాలల ప్రారంభంపై తొందరేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారని పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు.
జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించేలా.. 50శాతం ఉపాధ్యాయులే హాజరయ్యేలా ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం చెప్పారని పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని సీఎంకు పీఆర్టీయూ టీఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజించి.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఆన్లైన్ తరగతులపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు