ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. స్వల్ప జ్వరం కారణంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. ప్రధాని శనివారం పాల్గొనే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభం, ముచ్చింతల్ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారా లేదా అన్నదానిపై శుక్రవారమే కొంత చర్చ జరిగింది. ప్రధానమంత్రి పర్యటనలో మినిస్టర్ ఆన్ వెయిటింగ్‌గా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం నామినేట్ చేయడంతో ఊహాగానాలకు తెరలేచింది. అయితే ప్రధాని స్వాగత.. వీడ్కోలు కార్యక్రమంతో పాటు ఇక్రిశాట్, సమతామూర్తి విగ్రహావిష్కరణలో సీఎం పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉన్నతస్థాయి అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. మినిస్టర్ ఆన్ వెయిటింగ్ ప్రొటోకాల్‌లో భాగమేనన్నారు.
స్వాగత, వీడ్కోలు జాబితాలో ముఖ్యమంత్రి పేరు
ప్రధాని స్వాగత కార్యక్రమంలో వరుసగా ఎవరెవరు ఉంటారనే దానిపై సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి అధికారులందరికీ సమాచారమిచ్చారు. 20 మంది పేర్లతో ఉన్న ఈ జాబితాను ప్రధాని కార్యాలయం ఆమోదించినట్లు కూడా ఉంది. ఇందులో మొదటి పేరు గవర్నర్ తమిళసైది కాగా రెండోది ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. మూడు నుంచి ఆరు వరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్లున్నాయి. ఏడో పేరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొలన్ సుష్మది. 8 నుంచి 11 వరకు సీఎస్, డీజీపీ, సైబరాబాద్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్ కాగా, మిగిలిన వారు భాజపా నాయకులు. ప్రధానికి వీడ్కోలు పలికే 23 మంది జాబితాలో గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రితో పాటు పలువురు భాజపా నాయకులున్నారు. జీఏడీ జారీ చేసిన ఈ సర్య్కులర్ ప్రకారం ప్రధాని స్వాగత, వీడ్కోలు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఉంది. అయితే శనివారం జరిగిన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.కేంద్ర ప్రభుత్వ తీరుపై, రాష్ట్రానికి సహకరించడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండటం, భాజపా నాయకులు కూడా ప్రత్యారోపణలు చేస్తున్న నేపథ]్యంలో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో సీఎం పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: