ప్రగతి భవన్ వేదికగా మంగళవారం కలెక్టర్ల సదస్సు జరగనుంది. క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టించడమే ధ్యేయంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలన్నీ ముగిశాయి. ఏడాదిన్నర కాలంగా ఎపుడూ ఏదో ఒక ఎన్నికలు జరగడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం వల్ల పాలనపై ఆ ప్రభావం పడింది. మరో మూడున్నరేళ్ల పాటు రాష్ట్రంలో ఇక ఎలాంటి ఎన్నికలు లేవు. పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు.
అందుకే బదిలీలు
క్షేత్రస్థాయిలో పరిపాలనను పరుగులు పెట్టించేందుకు వీలుగా అధికారుల బదిలీలు చేపట్టారు. మొత్తం 33 జిల్లాలకు గాను ఏకంగా 21 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. చాలా వరకు కొత్త వారికి కలెక్టర్లుగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆలోచనలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
సంస్కరణలు
పాలనాపరంగా కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సంయుక్త కలెక్టర్ పోస్టులను రద్దు చేసి కొత్తగా అదనపు కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించి వివిధ పాలనా బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లుగా ఉన్న పలువురినే అదనపు కలెక్టర్లుగా నియమించారు. కొన్ని జిల్లాలకు కేవలం స్థానికసంస్థల కోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లను నియమించారు.
తెలంగాణ పాలనా సర్వీస్ ఏర్పాటు!
ఐఏఎస్ తరహాలో తెలంగాణ పాలనా సర్వీస్‌ను ఏర్పాటు చేసి కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లకు వివిధ శాఖల బాధ్యతలు అప్పగించడం ద్వారా పారదర్శక పాలన అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ నేపథ్యంలో సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనలు, అమలు విషయమై కలెక్టర్ల సదస్సు వేదికగా మార్గనిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి: నూతన ఒరవడి: ఇకపై జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లు