రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. లాక్‌డౌన్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అమలులో ఉన్పప్పటికీ రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ పనులకు ఆటంకం కలగరాదు..
రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నా వ్యవసాయ పనులకు ఆటంకం కలగరాదని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరగాలని స్పష్టం చేశారు. వరికోతలకు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితి గ్రామాల్లో కల్పించాలని సూచించారు. హార్వెస్టర్ పరికరాలు బిగించే మెకానిక్‌లకు పాసులిచ్చి అనుమతించాల్నారు. స్పేర్ పార్ట్స్ అమ్మే దుకాణాలు తెరవడానికి అనుమతివ్వాలని పేర్కొన్నారు.
చివరి గింజ వరకు..
గ్రామస్థులు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలి. అనంతరం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే వాహనాలకు అనుమతివ్వాలి. రైతులందరూ ఒకేసారి కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా చూడాలి. కూపన్లలో తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు రైతులు రావాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది - సీఎం
ప్రధానికి ఫోన్..
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉందని ప్రధానికి వివరించారు. పశ్చిమబంగాలోని గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలు తెరిపించాలని కేసీఆర్ కోరారు. పరిశ్రమలు తెరిపిస్తే గన్నీ బ్యాగుల సమస్యల కొలిక్కి వస్తుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని ప్రధానికి వివరించారు.
సీఎం కేసీఆర్ అభ్యర్థనకు మోదీ సానుకూలంగా స్పందించారు. గన్నీ బ్యాగులు చేరవేసే విషయంలో ఆయా శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఈనెల 14న నిర్ణయం