ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెరాస నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెరాస విద్యార్థి, యువజనసంఘం తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శిబిరాన్ని ప్రారంభిస్తారు. సిద్దిపేటలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ జరగనుంది. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట స్టేడియంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటనున్నారు. శాసనసభ ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటనున్నారు.
హైదరాబాద్లోని బల్కంపేటలోని ఎల్లమ్మ గుడిలో అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా రెండున్నర కిలోల బంగారు చీర సమర్పించనున్నారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్పై రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ విడుదల చేయనున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.