రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సేవలు కొనసాగించాలని తెరాస నిర్ణయించింది. సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర, తదితర అంశాల ప్రచారంలో ఐప్యాక్ సేవలను తెరాస వినియోగించనుంది. తెరాస అధినేత కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
కాంగ్రెస్ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో.. పీకే హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న(ఏప్రిల్ 23న) ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న పీకే.. రాత్రి వరకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ప్రగతిభవన్‌లోనే రాత్రి బస చేసిన పీకే.. ఈరోజు(ఆదివారం) మరోసారి సీఎంతో భేటీ అయ్యారు.
రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి, లేదా పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై, ప్రజాభిప్రాయంపై నిర్వహించిన సర్వేలను సీఎంకు పీకే విశ్లేషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర పట్ల కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే అంశంపై చర్చించినట్టు సమాచారం. ఇద్దరు త్వరలోనే మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.
రెండ్రోజులుగా పీకేతో జరిగిన చర్చల తర్వాత సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ప్రశాంత్‌కిశోర్.. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.
ఇవీ చూడండి: