ఏపీ చిత్తూరు జిల్లాలో 2.5 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,78,840 ఇళ్లు కట్టబోతున్నామని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఒక్క ఊరందూరులోనే 6 వేల 732 మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని జగన్ తెలిపారు. ఊరందూరులో ఇచ్చే ఇళ్ల స్థలం మార్కెట్ ధర సెంటు రూ.7 లక్షలు ఉందన్నారు.
'ఎన్నికల హామీలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పాం. చెప్పిన దానికంటే ఎక్కువగా 31 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నాం. లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడట్లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు అందిస్తున్నాం'
- సీఎం జగన్
లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా మారబోతోందన్నారు. అనేక ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. డబ్బు విలువ మహిళలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని వివరించారు.
ఇదీ చదవండి:పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం: నిరంజన్‌రెడ్డి