New districts: కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య.. 13 నుంచి 26కు పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో జిల్లాలను ప్రారంభించారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతల స్వీకరించారు. పునర్విభజన తర్వాత రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా. పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పడ్డాయి.
రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపు మారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి, 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని మార్పులు. -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను దాదాపుగా పరిగణనలోకి తీసుకొని, ఏపీ జిల్లాల ఏర్పాటు-1974 సెక్షన్ 3(5) నిబంధన ప్రకారం ప్రభుత్వం పునర్విభజన చేపట్టింది. దీనిపై గత జనవరి 25న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనల తర్వాత తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు 68 రోజుల సమయం పట్టింది. ప్రణాళిక సంఘం, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, సాధారణ పరిపాలన విభాగం, ఆర్థిక శాఖలు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాయి.
కొత్త ప్రదేశాలకు ఉద్యోగులు: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, ఇతర డివిజన్ స్థాయి అధికారుల పరిధులు తగ్గిపోతున్నాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న అధికారులు, సిబ్బంది కేటాయించిన చోటుకు చేరుకుంటున్నారు. జనాభా, కార్యాలయాలు, మండలాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించారు. పాత, కొత్త జిల్లాల నడుమ ఉద్యోగుల విభజన 55:45, 60:40 నిష్పత్తిలో చేయగా, కొన్నిచోట్ల ఇంకా హెచ్చుతగ్గులు అనివార్యమయ్యాయి. శాఖల వారీగానూ కొంత వ్యత్యాసం ఉంది. జూనియర్ సిబ్బందిని ‘రివర్స్’ సీనియారిటీ ద్వారా కొత్త జిల్లాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో 70 వరకు ప్రభుత్వ శాఖలు, 120 కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో ముఖ్యమైన కార్యాలయాలు మాత్రమే నడవనున్నాయి. సైనిక సంక్షేమం, ఉద్యానం తదితర తక్కువ సిబ్బంది ఉండే శాఖల ఉద్యోగులు పాత జిల్లాల్లోనే ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కొత్త ప్రదేశానికి మారుతున్న సహచరులకు వీడ్కోలు పలుకుతూ, ఉద్యోగ వర్గాలు గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాయి.
ఇదీ చదవండి: పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు