కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ హాజరై.. అభిప్రాయాలు పంచుకున్నారు. వ్యాక్సిన్ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రులతో... ప్రధాని చర్చించారు. వాక్సిన్ పంపిణీలో అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మారుమూల ప్రాంతాలకూ వ్యాక్సిన్ వెళ్లాలి..
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీలో అనుసరించాల్సిన పద్ధతులపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం కీలకమని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాలకు తరలించడమూ కీలకమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సిన్ సంబంధిత అంశాలపైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందించాలి: కేసీఆర్