ETV Bharat / city

CJI Justice NV Ramana: జడ్జీల నియామకంపై సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ కీలకవ్యాఖ్యలు!

CJI Justice NV Ramana: విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన లావు వెంకటేశ్వర్లు 5వ స్మారక ఉపన్యాస సభకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ - భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో రివాజుగా మారిందన్నారు. దీని గురించి బాగా తెలిసినవారూ దుష్ప్రచారం చేయడం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

CJI JUSTICE NV RAMANA :
CJI JUSTICE NV RAMANA :
author img

By

Published : Dec 27, 2021, 5:47 AM IST

CJI Justice NV Ramana: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో రివాజుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద అపోహని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియంలు, ఐబీ, అత్యున్నత స్థాయి కార్య నిర్వాహక వ్యవస్థ కలిసి ఓ అభ్యర్థి యోగ్యతలను పరిశీలిస్తాయని తెలిపారు. దీని గురించి బాగా తెలిసినవారూ దుష్ప్రచారం చేయడం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు కొన్ని శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన లావు వెంకటేశ్వర్లు 5వ స్మారక ఉపన్యాస సభకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ - భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు.

భవిష్యత్తు సవాళ్లు

ప్రస్తుతం న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో రోజురోజుకూ కొత్త సమస్యలు, కొత్త తరహా కేసులు వస్తున్నాయి. అంతర్జాలం, డార్క్‌వెబ్‌లో అక్రమ వస్తువుల అమ్మకం, ఆన్‌లైన్‌లో మోసాలు, హ్యాకింగ్‌, విద్వేష ప్రసంగాల వ్యాప్తి వంటివి మన ముందున్న సరికొత్త సవాళ్లు. మనీ లాండరింగ్‌, డిజిటల్‌ కరెన్సీ ద్వారా నేరాలకు డబ్బు సమకూర్చడం వంటివి బాగా పెరిగాయి. వీటిని అర్థం చేసుకోవడం న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులకు కష్టతరంగా మారుతోంది. న్యాయమూర్తులు, న్యాయవాదులకు వీటన్నింటిపై అవగాహన ఉండాలంటే.. సాంకేతిక పరిజ్ఞానం గురించి విస్తృతంగా తెలుసుకోవాలి. ట్రాయ్‌, సెక్యూరిటీస్‌ ట్రైబ్యునల్‌, కాంపిటీషన్‌ కమిషన్‌, విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ వంటివి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు మారాలి. ట్రైబ్యునళ్లలో సాంకేతికతపై అవగాహన ఉన్నవారిని సభ్యులుగా నియమించాల్సిన అవసరాన్ని ఇది చాటిచెబుతోంది. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన పిటిషన్ల కంటే వీటికి ఎంతో ప్రాధాన్యమివ్వాలి. చట్టాలు చేసే ముందు దాని ప్రభావం, రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా లేదా అన్నదానిపై సరైన మదింపు జరగడం లేదు. చట్టం ముసాయిదా తయారీకి ముందే ఇవన్నీ ఒకటికి, రెండుసార్లు సరిచూసుకోవడం శాసన వ్యవస్థ కనీస బాధ్యతగా భావించాలి. చట్టం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం వాటి రూపకల్పన సమయంలోనే ఆలోచించాలి. చట్టాలు చేసేటప్పుడు ముందుచూపు కొరవడితే కోర్టుల్లో కేసులు పెరుగుతాయి. దీనికి మంచి ఉదాహరణ బిహార్‌ ప్రొహిబిషన్‌ చట్టం. 2016లో ఇది అమల్లోకి వచ్చాక హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు భారీగా పెరిగిపోయాయి. దీనివల్ల సాధారణ బెయిల్‌ దరఖాస్తు పరిష్కారానికీ ఏడాది పట్టింది’ అని చెప్పారు.

ప్రభుత్వం తనకు మెజారిటీ ఉందని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోరాదు. ప్రతి నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను సమాన హోదాలతో సృష్టించింది. మిగిలిన రెండు వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. ఆ అధికారం కోర్టులకు లేకుంటే.. దేశంలో ప్రజాస్వామ్యం పనితీరు ఊహించడమే కష్టమయ్యేది.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

జడ్జిలపై విషప్రచారం తగదు

న్యాయమూర్తులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని, న్యాయాధికారులపై భౌతిక దాడులు నమోదవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వీటిని పలుసార్లు ప్రస్తావించాను. కక్షిదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడకపోతే జడ్జిలపై ఓ ప్రణాళిక ప్రకారం ప్రింట్‌, సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు. వీటిని దర్యాప్తు సంస్థలు సమర్థంగా ఎదుర్కోవాలి. ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకుని, ఆదేశించే వరకు అధికారులు దర్యాప్తునకు పూనుకోకపోవడం దురదృష్టం. ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయమూర్తులు, న్యాయాధికారులు నిర్భయంగా విధులు నిర్వహించేలా తోడ్పాటు అందించాలి. కేసుల పరిష్కారం విషయంలో మీడియా ట్రయల్స్‌ ప్రామాణికం కాజాలవు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే భారీగా నిధులు అవసరం ఉంది. జాతీయ, రాష్ట్ర న్యాయ మౌలిక వసతుల ప్రాధికార సంస్థలు ఎప్పుడో ఏర్పడాల్సింది. సాధ్యమైనంత త్వరగా వీటిని సాకారం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నా’ అని వివరించారు.

ఖాళీల భర్తీకి చర్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక, న్యాయ నియామకాలు పెంచడంపై దృష్టి సారించానని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ఇటీవల కాలంలో న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నానన్నారు. హైకోర్టులు చేసిన సిఫార్సులను కేంద్ర న్యాయ శాఖ, ఇంకా సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉంది. ఖాళీలు లేకుండా చూడాలన్నదే తన ఆకాంక్షని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునళ్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. న్యాయ వ్యవస్థలో రెండు, మూడు దశాబ్దాలపాటు పని చేసి, పదవీ విరమణ పొందిన జడ్జిలకు కనీస వసతులూ దక్కడం లేదు. బలమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ సాకారం కావాలంటే ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. దేశంలోని వివిధ కోర్టుల్లో మొత్తం 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ కేసుల బాధ్యత న్యాయ వ్యవస్థదే అనే ముందు ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి. మొత్తం పెండింగ్‌ కేసుల్లో 46 శాతం ప్రభుత్వాలకు సంబంధించినవే. అధికారుల చర్యలు, నిష్క్రియాపరత్వం కారణంగా ఇవి పెరుగుతున్నాయి. ఎక్కువగా భూసేకరణకు సంబంధించినవే. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా వీటిని పరిష్కరించుకోవాలి. కేసుల వాయిదాల విషయంలో న్యాయమూర్తులు కఠినంగా వ్యవహరించాలి’ అని సూచించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ లలిత, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు పాల్గొన్నారు.

మీ మూలాలను మర్చిపోవద్దు

నేటి తరం తెలుగుభాషను నిర్లక్ష్యం చేయొద్దని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విజ్ఞప్తి చేశారు. ‘మీరంతా రాబోయే కాలంలో సమాజానికి నాయకత్వం వహించాల్సినవారు. న్యాయవాద వృత్తిని చేపట్టబోతున్నారు. మీకు మాతృభాషలో ప్రావీణ్యం ఉండాలి. ఇందుకోసం తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా చదవండి. తెలుగుభాషను, సొంతూరిని, మీ మూలాలను మర్చిపోవద్దు’ అని కోరారు.

'కార్య నిర్వాహక వ్యవస్థ సహకరించట్లేదు'

‘దేశంలో చట్టబద్ధ పాలన నెలకొనేలా చూడటంలో కార్య నిర్వాహక వ్యవస్థ తోడ్పాటు అందించాలి. కానీ కోర్టు ఆదేశాలను కార్య నిర్వాహక విభాగం అగౌరవపరిచే పోకడ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయం చేయడం ఒక్క న్యాయ వ్యవస్థ బాధ్యతే కాదు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు న్యాయ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కోర్టులకే జవాబుదారీగా ఉండాలి. కానీ ప్రభుత్వ చెప్పుచేతుల్లో ఉంటూ.. స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. పసలేని కేసులు కోర్టుల వరకు రాకుండా నివారించడంలో విఫలమవుతున్నారు. దీనికి విరుగుడుగా.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాల కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.’

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తల్లికి పాదాభివందనం

...

‘లావు వెంకటేశ్వర్లుకు పెదనందిపాడు గ్రామం అన్నా, అక్కడి ప్రజలన్నా ఎనలేని అభిమానం. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారు. క్రీడలను, యువతను ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తితోనే జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పెదనందిపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు’ అని సీజేఐ చెప్పారు. ‘అడ్వకేట్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్‌ నాగేశ్వరరావును వారి మాతృమూర్తి నాగేంద్రమ్మ ఎప్పుడూ పొగడలేదట. ఆమె ఎప్పుడూ కోర్టులు, న్యాయమూర్తులు, రాజకీయాల గురించి ప్రస్తావించేవారు కాదట. కానీ ఈ మధ్య ఆమె మన రమణ సీజేఐగా బాగా పని చేస్తున్నారని అన్నారట. నీకెలా తెలిసిందని జస్టిస్‌ నాగేశ్వరరావు అడిగితే.. పత్రికలు, టీవీల్లో చూస్తున్నా, అందరూ చెబుతున్నారుగా అన్నారట. ఒక మాతృమూర్తి తన కుమారుడితోపాటు పని చేసే వ్యక్తిని అతని కంటే గొప్పగా ప్రశంసించడం అభినందనీయం. అమ్మా.. నాకు కన్నతల్లి లేని లోటును తీర్చి నన్ను ఈ విధంగా ఆశీర్వదించావు’ అంటూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నాగేంద్రమ్మ పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు. లావు వెంకటేశ్వర్లు చిత్రపటంవద్ద జస్టిస్‌ రమణ నివాళులర్పిస్తున్న సందర్భంగా నాగేంద్రమ్మ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐ ఆమెను ఆత్మీయంగా హత్తుకుని అనునయించారు.

ఇదీచూడండి: CJI Justice NV Ramana: జడ్జిలపై దాడులను అందరూ ప్రశ్నించాలి: సీజేఐ జస్టిస్​ ఎన్​.వి రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.