Producers on Cinema Tickets Price : సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయటంపై సినీ నిర్మాతలు స్పందించారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాతలు.. ప్రస్తుత జీవో చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. ఇదే జీవోను.. భీమ్లా నాయక్‌కు ముందే ఇస్తే మరింత బాగుండేదని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటామని... సమస్యల పరిష్కారానికి చిరంజీవిది ముఖ్య పాత్ర అని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారమని... పరిశ్రమలోని పెద్ద సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. కొవిడ్ కంటే జీవో 35తో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ సతమతమయ్యేవారన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. ఫ్రెండ్లీ ప్రభుత్వాలని ఎన్వీ ప్రసాద్ అన్నారు.
చిరంజీవే పెద్దదిక్కు..
వివాదాలకు తెరదించుతూ టికెట్ ధరలపై జీవో ఇవ్వడం సంతోషకరమని మరో నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలనే కోరిక సీఎం జగన్‌కు ఉందని... అందుకు అనుగుణంగా విశాఖలోనూ సినీ పరిశ్రమ ప్రాతినిధ్యం వహించేలా కృషిచేస్తామని తెలిపారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సినీపరిశ్రమలో చిరంజీవే తమకు పెద్డదిక్కు అని సి.కల్యాణ్ అన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంలను సన్మానిస్తామని.., ఈ విషయంపై మాట్లాడేందుకు చిరంజీవిని కలువనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తమ విన్నపాలు కొంతవరకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని నిర్మాత తమ్మారెడ్డి అన్నారు. మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఉన్న టికెట్ ధరల సమస్యకు జగన్ తెరదించారని జెమిని గణేశ్ అన్నారు. కొత్త జీవోతో నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయన్నారు.
సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ..
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.
సంబంధిత కథనం: రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం