ITDP coordinator Venkatesh: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల ప్రోద్బలంతోనే సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినట్లు చెప్పాలంటూ సీఐడీ అధికారులు తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ సమన్వయకర్త అప్పిని వెంకటేశ్ తెలిపారు. వారిద్దరి పేర్లు చెబితే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామంటూ ప్రలోభ పెట్టారని చెప్పారు. తనను విచారిస్తున్న సమయంలో సీఐడీ అధికారులకు పలుమార్లు ఫోన్లు వచ్చాయని, ఆ కాల్స్ మాట్లాడిన తర్వాత ప్రతిసారి... వారు తన వద్దకు వచ్చి లోకేశ్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో ఒకరు వెనుక నుంచి నడిపిస్తున్నారనేది తనకు అర్ధమైందని పేర్కొన్నారు.
అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని పేర్కొంటూ ఉన్న పోస్టును సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారన్న ఆరోపణపై అప్పిని వెంకటేశ్‌పై సీఐడీ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. గురు, శుక్రవారాల్లో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, న్యాయవాది మాగులూరి హరిబాబులతో కలిసి మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గుంటూరులో విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారి ఒకరు.. 'లోకేశ్‌కు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు' అంటూ ఒత్తిడి చేశారు. ఆ సమయంలో సాక్షి మీడియా ప్రతినిధులు కూడా సీఐడీ కార్యాలయంలో ఉన్నారు. అసలు వారిని ఎవరు? ఎందుకు అనుమతిచ్చారో తెలియదు. ఆ రోజు రాత్రి 8.30 గంటల వరకూ నన్ను అక్కడే ఉంచారు. అనంతరం శుక్రవారం విచారణకు హాజరుకావాలన్నారు. సీఐడీ కార్యాలయం లోపలికి ఎవర్నీ వెళ్లనీయలేదు. ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని చెబుతూ పంపించేశారు’’ అని వెంకటేశ్ అన్నారు.