కొవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు పరీక్షలను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొవిడ్ విషయంపై సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టెస్టింగ్, ట్రేసింగ్, చికిత్స, టీకా, కొవిడ్ నిబంధనలు పాటించటంపై పలు ఆదేశాలు జారీ చేశారు.
రోజువారీగా చేసే పరీక్షలను రెట్టింపు చేయాలని కలెక్టర్లకు తెలిపారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో టెస్టుల సంఖ్య తగ్గుకుండా చూడాలని... కరోనా పరీక్షా కేంద్రాలు వారంలో అన్ని రోజులు పనిచేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ఆచూకీ కోసం కొత్త టెస్టింగ్ యాప్‌ను ఉపయోగించుకోవాలని... ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం లక్షణాలు లేని వారికి నెగిటివ్ వచ్చినట్లయితే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయాలని సూచించారు. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న వారిని టెలి కాలింగ్ లేదా ఇంటి వద్దకు వెళ్లైనా మానిటర్ చేయాలని... ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలు అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 మందికి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 200, జిల్లా ఆస్పత్రి లేదా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 300 మందికి వ్యాక్సినేషనల్ చేయాలని... తద్వారా రోజువారీగా వ్యాక్సినేషన్ ఇప్పుడున్న 50వేల స్థాయి నుంచి 1.25 లక్షల స్థాయికి చేరుతుందన్నారు. ఎక్కువ పాజిటివ్ కేసులున్న ప్రాంతంలో ఎక్కువ టెస్టులు చేయాలని... కొవిడ్ కేర్ కేంద్రాల్లో 24 గంటలు వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపై కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని... మాస్కుల ఉపయోగం, మత సంబంధ సమావేశాల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలయ్యే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలేవి?: హైకోర్టు