తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉందని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. సాధ్యమైనంత మేరకు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విస్తృతస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అదనంగా రూ.100 కోట్లు ఇచ్చాం
త్వరలో టీకా రానున్న నేపథ్యంలో దాని డిమాండును దృష్టిలో ఉంచుకొని తయారీ, పంపిణీకి ప్రణాళికాబద్ధంగా విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సూచించారు. ఆగస్టు నాటికి వ్యాక్సిన్ వస్తే వ్యాధి బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కేసులు, మరణాలు, కోలుకుంటున్న వారి గణాంకాలను వివరించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, బడ్జెట్ నిధులు కాకుండా అదనంగా రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశామన్నారు.
రాష్ట్రంలో రికవరీ రేటు 67 శాతం వరకు ఉంది. తగినన్ని పడకలు ఏర్పాటు చేశాం. 1500 వెంటిలేటర్లు, లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది చక్కటి సేవలందిస్తున్నారు’.
- సీఎం కేసీఆర్
టీకా తయారీ-పంపిణీకి ముందస్తు సన్నాహాలు చేయాలి
‘అతి త్వరలోనే భారత్ నుంచి కరోనా నివారణకు టీకా వచ్చే వీలుందని కేసీఆర్ ఆకాంక్షించారు. కోట్ల మందికి అవసరమైనందున గందరగోళం లేకుండా అందరికీ అందించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. టీకాను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడంతో పాటు వాటి నిల్వకు వాయిల్స్, ఇంజక్షన్ కోసం సిరంజీలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఔషధ సంస్థలను పురమాయించాలని... తెలంగాణ ప్రభుత్వం దీనికి పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడి ఔషధ సంస్థలు అన్ని విధాలా సహకారం అందిస్తాయని తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, వెంటిలేటర్లు, ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు సీఎంలకు మోదీ ఫోన్
సీఎం కేసీఆర్‌తో పాటు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో ఆదివారం ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై చర్చించారు.
ఇదీ చదవండి: డిసెంబరు కల్లా కొవిడ్-19 వ్యాక్సిన్!