కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకొనేందుకు నూలు, రంగులు, రసాయనాలలో 40 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేతమిత్ర పథకం ఆశించిన లక్ష్యాన్ని చేరలేదు. ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తుండగా, మూడేళ్లలో ఈ పథకానికి వెచ్చించింది 11.23 కోట్లు మాత్రమే. మాస్టర్ వీవర్లు, కొన్ని సంఘాల నిర్వాకం వల్ల పథకం కొంత మేరకు పక్కదారి పట్టింది.
కేంద్ర ప్రభుత్వం కేవలం పదిశాతం నూలు సబ్సిడీ మాత్రమే ఇస్తోందని, అదీ తమకు చేరడం లేదని కార్మికులు పలు సందర్భాల్లో విన్నవించడంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని ప్రారంభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బడ్జెట్‌లో రూ.100 కోట్ల చొప్పున కేటాయించారు. దీని విధివిధానాల్లో... కార్మికులు కొనుగోలు చేసిన నూలు, రంగులు, రసాయనాల ధరలో 40 శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో సొసైటీకి ఐదు శాతం, 35 శాతం నేసిన వారికి, నేతకు అవసరమైన సన్నాహాలు చేసిన వారికి ఇవ్వాలి. దీనివల్ల చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని, వారికి పెట్టుబడుల భారం తగ్గుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది.
సంఘాల నిర్వాకం
చేనేత సంఘాలు కార్మికులతో పనులు చేయించేందుకు వీలుగా నూలు, రంగులు, రసాయనాలను కొనుగోలు చేస్తాయి. కానీ, చాలా సంఘాలు మగ్గాలను నడిపించకుండా, కార్మికులకు పనులు ఇవ్వకుండా నూలు, రంగులు, రసాయనాలు కొనుగోలు చేసినట్లు చూపి, చేనేత శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. కొన్ని చోట్ల దళారులు సంఘాల పేరిట నేత, దానికి సన్నద్ధత పేరిట నిధులను పొందారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్ మరికొన్ని జిల్లాల్లో ఈ తంతు సాగింది. కొన్ని సంఘాలు నిధులను పొందాయి. చౌటుప్పల్ కేంద్రంగా భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కార్మికుల పేరిట కొందరు దళారులు నిధులను కాజేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో చాలా సంఘాలు నడవలేదు. కేవలం నూలు మినహా రంగులు, రసాయనాల వినియోగమే జరగలేదు. సహకారేతర రంగంలోని కార్మికులకు సైతం ఈ పథకం చేరలేదు.మొత్తంగా ఏటా 40 వేల మంది కార్మికులకు లబ్ధి లక్ష్యం. మూడేళ్లలో 1.20 లక్షల మందికి సాయం అందాలి. కానీ, 74,542 మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదయ్యారు.
అమలుపై విచారణ
పథకం నిర్వహణ లోపాల గురించి పలు సంఘాల నేతలు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరిపారు. పలు అంశాలు వెలుగులోకి రాగా ప్రభుత్వం దాని గురించి జిల్లాల సహాయ సంచాలకుల వివరణ కోరింది.దీని ఆధారంగా పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది.