వలస కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి పలుచోట్ల వసతి, భోజన ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేస్తోంది. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు, వ్యవసాయ పనులకు వచ్చిన వేలాది వలస కార్మికులు రాజధాని నగరం, శివారు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో నివసిస్తున్నారు. కొందరు కంపెనీల షెడ్లలో, మరికొందరు అద్దె గదుల్లో ఉంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు తమకు నగదు, బియ్యం సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని గుర్తించలేకపోవడం కారణంగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పలుచోట్ల వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, భోజనం పంపిణీ చేస్తుండటం కొంత ఊరటనిస్తోంది.
కూలి పనికి అని వచ్చి... ఇరుక్కున్నాం
ఆరు నెలల క్రితం పది మంది కలిసి చౌటుప్పల్‌కు వచ్చామని కొంత మంది కార్మికులు చెబుతున్నారు. రోజుకు రూ.500 కూలీకి ఓ గుత్తేదారు వద్ద చేస్తున్న పని లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. ప్రభుత్వం నుంచి సాయం అందలేదని వాపోయారు. రోజంతా గదిలోనే ఉండాల్సిన దుస్థితని... బయటకూ పోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గదుల వల్ల సమాజిక దూరం కూడా పాటించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులందరినీ ఆదుకుంటాం...
చౌటుప్పల్ డివిజన్‌లో 7287 మంది వలస కార్మికులను గుర్తించినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ తెలిపారు. 6,644 మందికి రూ.500 నగదు, 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశామన్నారు. ఇంకా చాలామంది కార్మికులు వస్తున్నారని అన్నారు. వారినీ ఆదుకునేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని స్పష్టం చేశారు.
బిడ్డ పోయిన.. 3 రోజులకే !
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన పూజ భర్తతో కలిసి సుమారు 20 రోజుల కిందట ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలురుపాడు మండలానికి కూలి పనుల కోసం వచ్చారు. అప్పటికే నిండు గర్భిణి అయిన ఆమెకు మార్చి 29న పురిటినొప్పులు మెుదలయ్యాయి. అనంతరం బాలింత కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై ప్రసవమైంది కానీ కొన్ని గంటలకే శిశువు మరణించింది. దుఃఖాన్ని దిగమింగుకొని మూడోరోజు నుంచే మిరప తోటల్లో కూలి పనులకు వెళ్లక తప్పని దుస్థితి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది వలస కూలీలు ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో పనిచేస్తున్నారు.