ఇంజినీరింగ్లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా రేపటి నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా పడింది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను నాలుగు రోజులకు కుదించి.. ఈనెల 18 నుంచి 22 వరకు చేపట్టాలని నిర్ణయించారు.
ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఈ నెల 22న కేటాయించాలని గతంలో నిర్ణయించినప్పటికీ.. తాజా మార్పుల నేపథ్యంలో ఈ నెల 24న కేటాయించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 20 వరకు.. స్లాట్లు బుకింగ్ చేసుకునే గడువు ఈనెల 19 వరకు కొనసాగనుంది. ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి యథాతథంగా ప్రారంభం కానుంది.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఇందుకోసం ఇప్పటి వరకు 35,824 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మంది పత్రాల పరిశీలనకు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి : కరోనా లక్షణాలు కనిపించిన వారు పరీక్ష చేయించుకోవాలి: సభాపతి పోచారం