ఏపీ ముఖ్యమంత్రి జగన్, డీజీపీ.. మీరు చేసింది నేరం. సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా. ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండండి’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించి.. నాటకాలు ఆడుతున్నారు. మీరు చేసిన చట్టవ్యతిరేక కార్యక్రమాలకు శిక్ష పడేవరకు వదిలిపెట్టను’ అని విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం 36 గంటల దీక్షను చేపట్టిన ఆయన.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై నిప్పులు చెరిగారు. ‘ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశాం. కానీ ఈ సీఎం ఆలోచనల్లోనే లోపం ఉంది. ఇలాంటి వాళ్లను సరిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. తెదేపా కార్యాలయంపై దాడి అనంతరం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని మీడియా సాక్షిగా చూపించి.. పోలీసులకు అప్పగించాం. ఫొటోలతో ఫిర్యాదు కూడా చేశాం. తర్వాత ఆ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా మాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. మేం అతన్ని కొట్టామా? మీ అధికారి మా అనుమతి లేకుండా మా కార్యాలయానికి ఎందుకొచ్చారు? మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు పెట్టే వ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు.. తెదేపా కార్యాలయంపై దాడికి పంపడానికి ఈ డీజీపీకి ఎంత ధైర్యం ఉండాలి?’ అని ధ్వజమెత్తారు.
తెలుగుదేశంపై ప్రతాపం చూపడం కాదు, చిత్తశుద్ధి ఉంటే మాదకద్రవ్యాలపై యుద్ధం చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు సూచించారు. ‘గంజాయి, హెరాయిన్ వాడే వారిపై ఉక్కుపాదం మోపండి. సహకరిస్తాం. మాదకద్రవ్యాలపై పోరాడుతుంటే.. మా కార్యాలయంపై దాడి చేస్తారా? ఇలాంటివి చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు బాగా పనిచేశారు. ఇప్పుడు కొందరు పోలీసులు సమాజహితం కోరే వారిపై దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వైకాపా నేతలు, పోలీసులూ.. పదవులు, పోస్టింగుల కోసం ఆలోచించొద్దు. పిల్లల భవిష్యత్తు, సమాజం కోసం ఆలోచించండి. సమాజమే సర్వనాశనమయ్యాక పదవులున్నా మీరు, నేను చేయగలిగేదేమీ ఉండదు. ఈ ముఖ్యమంత్రి ఉంటే ఇంకో రెండేళ్లే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘1984లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే.. ప్రాణాలకు సైతం వెనకాడకుండా పోరాడి 30 రోజుల్లో మళ్లీ సీఎంగా చేసిన చరిత్ర తెలుగుజాతిది. అప్పుడు ఈ డీజీపీ పిల్లాడిగాఉన్నారేమో. ముఖ్యమంత్రి గోళీలు ఆడుకుంటున్నారేమో. వీళ్లు నాకే నీతులు నేర్పిస్తారా? అధికారం వస్తే అహంభావంతో ఊరేగిపోతారా? మంత్రులు కొత్త నాటకాలాడుతున్నారు. రాష్ట్రంలో ఏదో కుట్ర, గొడవ జరుగుతోందని.. ముందే మాట్లాడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు అంటున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టిందే వాళ్లు’ అని దుయ్యబట్టారు.
మన ముఖ్యమంత్రి ఒక్క సమావేశమైనా పెట్టారా?
‘ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటోంది. వాటిపైనే పట్టాభి, తెదేపా నాయకులు మాట్లాడితే కేసులు పెట్టారు. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. మన ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమావేశం పెట్టారా? నక్కా ఆనందబాబు గంజాయిపై ఉదయం మాట్లాడితే.. సాయంత్రానికి నర్సీపట్నం పోలీసులు వచ్చారు. ఎక్కడ సమాచారం ఉంది చెప్పండన్నారు. రాజకీయ పార్టీగా అనేక రకాలుగా సమాచారం సేకరించుకుని, ప్రజలకు న్యాయం జరగడానికి పోరాటాలు చేస్తాం. అలా మాట్లాడితే నోటీసులిస్తున్నారు. సమాచారం కూడా మేమే ఇస్తే ఇక పోలీసులేం చేస్తారు’ అని ప్రశ్నించారు. ‘ఏపీని అడ్డాగా చేసుకుని హైదరాబాద్ నగరంతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు తరలిపోతున్నాయి. అంటే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌ది మాత్రమే కాదు, భారతదేశ సమస్య. దేశమంతా దీన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడదాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మాదకద్రవ్యాలను నియంత్రించే వరకు వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.
పట్టాభి వాడిన భాష తప్పన్నారు.. ముఖ్యమంత్రీ? మీరు వాడిన భాషేంటి? మీ బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలు వాడిన భాష ఏంటి? రికార్డులూ ఉన్నాయి. చర్చకు సిద్ధమా? అయిదు కోట్ల మందిని అడుగుదామా?
తెదేపా కేంద్ర కార్యాలయ గేటును.. కారుతో ఢీకొట్టి లోపలకు వచ్చారు. బీర్లు తాగుతూ వీరంగం సృష్టించారు. దొరికినవాళ్లను దొరికినట్లు కొట్టారు. తర్వాత పోలీసులు వచ్చి వారిని సాగనంపారు. సిగ్గనిపించలేదా? మీకు చేతకాకపోతే పోలీసు వ్యవస్థ మూసేసి ఇంటికి పొండి.. మమ్మల్ని మేం కాపాడుకుంటాం.
వైద్యులు సూచించినా.. ఆయన నిరాకరించారు..
గురువారం ఉదయం ఇంటి నుంచి దీక్షా స్థలికి బయల్దేరే ముందు చంద్రబాబు జావ మాత్రమే ఆహారంగా తీసుకున్నట్టు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. దీక్షకు కూర్చున్న తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు తాగారు. రోజంతా అర లీటర్ నీళ్లు మాత్రమే తాగినట్లు పార్టీ నేతలు చెప్పారు. ఆరోగ్యం దృష్ట్యా కొబ్బరినీళ్లయినా తీసుకోవాలని వైద్యులు సూచించగా... అందుకు ఆయన నిరాకరించారు. రోజంతా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కూర్చున్న చంద్రబాబు... రాత్రి పదిన్నర తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
ఇదీ చదవండి: Huzurabad by election: రంగంలోకి సీఎం కేసీఆర్.. రెండు రోజుల పాటు రోడ్‌షోలు..!