Chandrababu news: జె టాక్స్ వల్ల ఏపీలో కల్తీసారా విక్రయం పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారా, జె బ్రాండ్ మద్యం వల్లే ఎక్కువమంది మృతి చెందుతున్నారన్నారు. తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో వైకాపా వైఫల్యాలను ఎండగడ్డిన ఆయన.. నాటుసారా, జె బ్రాండ్ వ్యవస్థపై అధ్యయన కమిటీ వేయనున్నట్లు తెలిపారు.
వ్యాపారులను తీవ్రంగా వేధిస్తున్నారు..
వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారుల్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో అమరజీవికి ఆయన నివాళులర్పించారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్యులు, వ్యాపారులు చంద్రబాబును కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు. రాజకీయ ఉద్దండుడు కొణిజేటి రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఆయన పేరు ఎందుకు పెట్టరని..? ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రి అంటే రోశయ్య పేరు గుర్తు వస్తుందని.. అలాంటి మహా నేతకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్‌కు మనసు రాలేదని దుయ్యబట్టారు.
అందుకే నాటుసారా వైపు చూస్తున్నారు: అచ్చెన్న
జె బ్రాండ్ మద్యం కొనలేకే పేదలు నాటుసారా వైపు చూస్తున్నారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రభుత్వానికి రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:HOLI Restrictions: ఆ 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్