తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకొనేందుకు అధికార పక్షం, పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. బుధవారం ఉదయం నుంచి వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర, పెందుర్తి మండలంలో భూ సమీకరణ బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని తెదేపా నేతలు వారం క్రితమే ఖరారు చేశారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు పర్యటన వివరాలను ముందస్తుగా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్‌లకు పంపారు. విమానాశ్రయం నుంచి పెందుర్తికి ర్యాలీగా వెళ్లేందుకు అనుమతుల కోసం పోలీసులను సంప్రదించారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి షరతులతో కూడిన అనుమతి వచ్చింది.
భారీగా చేరుకున్న వైకాపా కార్యకర్తలు..
గురువారం ఉదయం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు తెదేపా కార్యకర్తలను ఎక్కడికక్కడ ఆపేశారు. అదే సమయంలో వైకాపా కార్యకర్తలు విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు. పోలీసుల షరతుల మేరకు తెదేపా నేతలు కొద్దిసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానంలో వచ్చిన చంద్రబాబు కారెక్కేసరికి వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. అక్కడున్న కొద్దిపాటి పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. ఒకదశలో చేతులెత్తేసి దూరంగా వెళ్లి నిలబడ్డారు.
పక్కా ప్రణాళిలక ప్రకారమే
చంద్రబాబు బయటకు వచ్చి కారులో కూర్చున్నాక కదలనీయకుండా దిగ్బంధించడం వెనుక అధికారపక్షం, పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాయని తెదేపా నేతలు ఆరోపించారు. బయట ఉద్రిక్తంగా ఉన్న విషయాన్ని పోలీసులు ముందే చెబితే చంద్రబాబు లాంజ్‌లో ఉండేవారని, కావాలనే బయటకు రప్పించి ఇలా దిగ్బంధించారని తెదేపా శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. 'రెండు రోజుల ముందు నుంచే వైకాపా నేతలు చంద్రబాబు పర్యటనపై దృష్టి సారించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు... విశాఖ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి సైతం కార్యకర్తలను తీసుకొచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచి కూడా కొంతమంది వచ్చారని' తెదేపా నాయకులు ఆరోపించారు.
ఒక్క కేసు నమోదు కాలేదు..
చంద్రబాబు పర్యటన వేళ విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు సృష్టించిన వైకాపా కార్యకర్తలపై పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మాజీ ముఖ్యమంత్రిని సుమారు 5 గంటలపాటు అడ్డుకోవడం, తెదేపా కార్యకర్తలపై దాడి ఘటనలు జరిగినా పట్టించుకున్న దాఖలాలు లేవు. భద్రత, ముందస్తు జాగ్రత్తల విషయాల్లోనూ పోలీసు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
దిద్దుబాటు చర్యలేవీ..
చంద్రబాబు వాహనాన్ని భారీగా నిరసనకారులు చుట్టుముట్టిన తరువాత కూడా పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. విమానాశ్రయంలోకి పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు ప్రవేశిస్తున్నా అడ్డుకొనే వారు లేకపోవడం పరిస్థితి తీవ్రతకు కారణమైంది. ఆందోళనకారుల్లో ఉన్న మహిళలను నిలువరించేందుకు మహిళా సిబ్బంది కూడా లేకుండా పోయారు. ఫలితమే.. పెద్ద సంఖ్యలో నిరసనకారులు చంద్రబాబు కూర్చున్న వాహనాన్ని పూర్తి స్థాయిలో చుట్టుముట్టారు.
కార్యకర్తలు, నేతలే రక్షణగా నిలిచారు...
చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొందని గుర్తించిన బ్లాక్ క్యాట్ కమాండోలు చంద్రబాబు బయటకు వచ్చిన సమయాల్లో రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెరిచారు. చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది, తెదేపా కార్యకర్తలు, నాయకులే చాలాసేపు ఆయనకు రక్షణగా నిలిచారు.
చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన మాజీ మంత్రి అచ్చంనాయుడుపై వైకాపా శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశాయి. విశాఖ దక్షిణం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ వాహనాన్ని అడ్డుకొని వ్యక్తిగత దుర్భాషలకు దిగారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను అసభ్య పదజాలంతో దూషించారు. విశాఖ తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి వాహనాన్ని ధ్వంసం చేశారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, కళా వెంకటరావుపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. సుమారు 3వందల మంది పోలీసులు అక్కడే ఉన్నా ఆయా ఘటనలపై ఎలాంటి చర్యలూ చేపట్టక పోవడం సహా కేసులూ నమోదు చేయలేదు.