ఏపీలో చంద్రబాబు చెపట్టిన రెండు రోజుల దీక్ష విజయవంతం(chandrababu 36 hours protest)గా సాగింది. 36 గంటల పాటు నిరసన కొనసాగించిన చంద్రబాబు.. పార్టీ నేతలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పీతల సుజాత, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధ చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు. దీక్ష విరమించే సమయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనసభాపక్ష ఉపనేత రామానాయుడు.. గజమాలతో చంద్రబాబును సత్కరించారు. ఈ రెండు రోజుల దీక్ష సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్.. నాయకులు, కార్యకర్తలతో కళకళలాడింది. ఏ సమయంలో చూసినా వేలాది మందితో సందడిగా కనిపించింది. పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు నిండా జనమే ఉన్నారు. తొలిరోజు దీక్ష తర్వాత ఆరోగ్యం ఎప్పటిలాగా ఉందని వైద్యులు నిర్ధరించాక చంద్రబాబు రెండోరోజు దీక్ష కొనసాగించారు. మద్దతు తెలపడానికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేశారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నేతలతో మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు, దీక్షకు మద్దతుగా వచ్చిన వివిధ సంఘాల నేతల ప్రసంగాలు కొనసాగాయి.
భారీ సంఖ్యలో కార్యకర్తల రాక..
తెలుగుదేశం ఏటా 3 రోజులపాటు నిర్వహించే మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తుంటారు. అయితే చంద్రబాబు 2 రోజులపాటు నిర్వహించింది నిరసన దీక్షే అయినా కార్యకర్తల్లో మాత్రం మరో మహానాడులో పాలొన్నంత ఉత్సాహం కనిపించింది. కొవిడ్ కారణంగా మహానాడును 2 దఫాలుగా ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు రావడం ద్వారా లోటు భర్తీ చేసుకున్నామని కార్యకర్తలు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో 300 కార్లలో జనం వచ్చారు. విజయవాడ నుంచి ఏంపీ కేశినేని నాని సారథ్యాన 50 కార్లలో వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో మంగళగిరి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
దీక్షకు పలువురి సంఘీభావం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి దీక్ష(chandrababu 36-hours deeksha)కు సంఘీభావం ప్రకటించారు. సోదరుడి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా వెళ్లినందున దీక్షకు స్వయంగా హాజరుకాలేకపోయానన్నారు. చంద్రబాబు దీక్షకు అఖిలభారత కిసాన్ మహాసభ అధ్యక్షుడు రావుల వెంకయ్య, లోక్‌సత్తా ప్రతినిధి మాలతి సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చదవండి: