ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సరిహద్దుల్లోని అల్పపీడనం.. గురువారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఇది.. నేటి తెల్లవారుజామున చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ‘గురువారం సాయంత్రం 5.30 గంటలకు చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 120 కి.మీ, కరైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు వద్ద చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశముంది’ అని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati meteorological department) సంచాలకులు స్టెల్లా, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy rains in AP) కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు(Rain updates in AP) పడతాయని చెప్పారు