గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలమైందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఆరోపించారు. ఆరేళ్లలో 60 వైఫల్యాలంటూ బల్దియాలో తెరాస పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఓవైసీ కుటుంబ పాలన నడుస్తోందని జావడేకర్ ఆరోపించారు.
వరదల వల్ల హైదరాబాద్ 15 రోజులు నీళ్లలోనే ఉండిపోయిందని... కనీసం డ్రైనేజీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. గ్లోబల్ సిటీ అని చెప్పి ఫ్లడ్ సిటీగా మార్చారని ప్రకాశ్ జావడేకర్ ఆక్షేపించారు. వరద సాయం సొమ్ములో సగం తెరాస నాయకుల జేబుల్లోకే వెళ్లిందన్నారు.