Nitin gadkari AP Tour : ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఏపీలోని 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ఏపీ సీఎం జగన్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన విజయవాడలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అన్నారు. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కీలకమైనవని.., వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీ అభివృద్ధిలో పోర్టులది కూడా కీలక పాత్ర అని వ్యాఖ్యనించారు.
దేశాభివృద్ధికి గ్రామాల అనుసంధానత కీలకమని భావించి..వాటి అనుసంధానతకు మాజీ ప్రధాని వాజ్‌పేయీ అనేక చర్యలు తీసుకున్నారని గడ్కరీ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపదని.. అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
రహదారుల అభివృద్ధికి నిధులు..
ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. 2024లోగా రాయ్‌పుర్-విశాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, నాగ్‌పుర్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, బెంగళూరు-చెన్నై మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామన్నారు.
"ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తాం. ఏపీలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం. 2024లోగా రాయ్‌పుర్-విశాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. నాగ్‌పుర్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. బెంగళూరు-చెన్నై మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్ ఎక్స్‌ప్రెస్ హైవే."
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
కాలుష్యం తగ్గించేందుకు చర్యలు..
దేశంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ అన్నారు. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా వాహనాల్లో సీఎన్‌జీ వాడాలన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ దేశం రైతులు కేవలం అన్నదాతలే కాదని.. విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారతారన్నారు.
ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ఏపీ చర్యలు తీసుకోవాలి. బయో ఇంధనాల ఉత్పత్తికి ఏపీ మరిన్ని చర్యలు తీసుకోవాలి. లాజిస్టిక్ పార్కుల కోసం రాష్ట్రం భూమి కేటాయించాలి. ఏపీ 20 ఆర్‌వోబీలు అడిగింది.. మేం 30 ఆర్‌వోబీలు ఇస్తున్నాం. జీడీపీ, తలసరి ఆదాయంలో ఏపీ చాలా ముందుంది.
- గడ్కరీ, కేంద్ర మంత్రి
పోలవరం పూర్తి చేసి రైతుల కష్టాలు తీరుస్తాం..
పోలవరం ప్రాజెక్టు 80 శాతం పూర్తయ్యిందని నితిన్ గడ్కరీ అన్నారు. పోలవరంలో తలెత్తిన మిగతా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల ప్రగతి గురించే ఆలోచిస్తోందని చెప్పారు. విదర్భలాగే ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. పోలవరం పూర్తి చేసి రైతుల కష్టాలు తీరుస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం అడిగినవన్నీ ఇచ్చామని.. తన శాఖలో వనరుల కొరత ఎప్పుడూ ఉండదని అన్నారు.
కార్యక్రమానికి ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రులు గడ్కరీ, కిషన్‌రెడ్డి, ఏపీ సీఎం జగన్ పరిశీలించారు.
ఘన స్వాగతం..
అంతకు ముందు ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి గడ్కరీ, కిషన్ రెడ్డి... దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, ఎమ్మెల్సీ మాధవ్, రోడ్డు భవనాల శాఖ, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు.
ఇదీ చదవండి : CBN Fire On YSRCP: ఉగ్రవాదులను మించిన పాలన వైకాపాది: చంద్రబాబు