Secunderabad Violence: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు.
నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంత మంది ఆర్మీకి ఎంపికయ్యారు? అభ్యర్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేసేవారు? పన్నులు కడుతున్నారా? లేదా వంటి ఇతరత్రా లావాదేవీలు, శిక్షణకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరలయ్యాయి. దీంతో సికింద్రాబాద్ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసరావుపేటకు తరలించి 3 రోజులుగా విచారిస్తున్నారు.
ఇవీ చూడండి..