ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా విధానానికి ముగింపు పలికినందున ఇక ఏ రాష్ట్రానికీ అది ఇవ్వడం కుదరదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో విభజన చట్టంలోని హామీల అమలుపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా.. ‘విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశాం. మిగిలిన వాటి అంశాల అమలు వివిధ దశల్లో ఉంది. ఇప్పటికీ 24 సమావేశాలు జరిగాయి’ అని నిత్యానందరాయ్ వివరించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చర్చ వివరాలివీ..
రామ్మోహన్ నాయుడు: విభజన చట్టం అమలు గురించి నేను సవివరంగా ప్రశ్నించా. అటువైపు నుంచి అంతే వివరంగా సమాధానం వస్తుందని ఆశించా. కానీ హోంశాఖ ఇచ్చిన సమాధానం అవమానకరంగా, బాధ్యతారహితంగా ఉంది. ఈ సమాధానం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న9 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. హోంశాఖ సమాధానం చూస్తే ఈ అంశాలపై వారికి ఆసక్తి, అవగాహన లేనట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందా? అలా చేస్తే ఇంతవరకు ఏమేమి అమలయ్యాయన్న విషయం ఇరు రాష్ట్రాల ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. హామీల అమలుకు చట్టంలో పదేళ్ల కాలపరిమితి విధించారు. కానీ ఇప్పటికే ఏడేళ్లు ముగిశాయి. మిగిలివని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు.
నిత్యానందరాయ్: మేం చాలా స్పష్టంగా సమాధానం చెప్పాం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వాటిని రాష్ట్రాల సహకారంతో సౌహార్ద్ర వాతావరణంలో పరిష్కరించాల్సి ఉంది. అందుకే కేంద్ర హోంశాఖ చాలాసార్లు ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం ఒకటి, రెండు కాదు చాలా అంశాలు పొందుపరిచారు. వాటి అమలుపై ఇరు రాష్ట్రాలు కలిసి నిర్ణయించుకోవాలి. ఇందులో కేంద్ర హోంశాఖకు ఎలాంటి ప్రమేయం లేదు. మీరు స్పష్టంగా ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెబితే దానికి సంబంధించిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
రామ్మోహన్ నాయుడు: రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయన్నది వేరే విషయం. చట్టంలోని చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నాయి. వాటి పరిష్కారానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంది? వాటి స్థితి ఏంటి? అనే అంశాలను మంత్రి స్పష్టంగా చెప్పకుండా అన్నీ అమలు చేశామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభాముఖంగా హామీ ఇచ్చారు. నేటి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆ హామీని పునరుద్ఘాటించడంతోపాటు, అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి వస్తే నేను సాధిస్తానని నేటి ఏపీ ముఖ్యమంత్రి సైతం వాగ్దానం చేశారు. ఇంతమంది చెప్పడంతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. దీనిపై హోంశాఖ సమాధానం చెప్పాలి.
నిత్యానంద్‌రాయ్: ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం విస్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. దాన్ని అనుసరించి 2014-15, 2015-16, 2016-17, 2019-20 సంవత్సరాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఒక్కోదానికి రూ.50 కోట్ల చొప్పున రూ.1,400 కోట్లు ఇచ్చాం. 2015-20 మధ్యకాలంలో రెవెన్యూలోటు కింద రూ.22,111 కోట్ల గ్రాంటు ఇచ్చాం. ఇవి మినహాయించి మిగిలిన సమస్యల్లో చాలావరకు రాష్ట్రాలే పరిష్కరించుకోవాల్సి ఉంది. 32 అంశాలపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాలను మాకు పంపింది. వాటిపై మీ అభిప్రాయం చెప్పాలని కోరుతూ తెలంగాణకు పంపాం. అక్కడి నుంచి మాకు ఎలాంటి సమాధానం రాలేదు. సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్నాయి తప్పితే కేంద్రం వద్ద ఏమీ పెండింగ్‌లో లేవు. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక విభజన చట్టం హామీల అమలుపై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇదే తొలిసారి. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఏ అంశంపైనా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సమస్యలన్నీ రాష్ట్రాల మధ్యే ఉన్నాయన్నట్లు పేర్కొనడం గమనార్హం.
ప్యాకేజీని అంగీకరించడం లేదు మిథున్‌రెడ్డి
వైకాపా సభ్యుడు మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... ‘2014 ఎన్డీయే మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ తిరుపతిలో హామీ ఇచ్చారు. మేం ప్యాకేజీలను అంగీకరించడం లేదు. చట్టం అమలుకు పదేళ్ల గడువుంటే ఇప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి. చాలా అంశాలు ఇంకా పూర్తి చేయలేదు. అందుకు కారణాలేంటో తెలియడం లేదు. మేం ప్రత్యేక హోదానే డిమాండు చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ‘ప్రత్యేక హోదా విధానాన్ని 14వ ఆర్థిక సంఘం రద్దు చేసింది. కానీ ఏపీ ప్రగతికి కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్యాకేజీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఇచ్చింది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ఎఫ్‌డీఐల రాకలో తెలంగాణకు 7వ స్థానం