CHSL Notification : వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మొదలైన పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2021-22 సంవత్సర నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్యను త్వరలోనే వెల్లడిస్తారు. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
CHSL Job Notification : మూడు దశల్లో నిర్వహించే కంప్యూటర్ విధానంలోని రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశ (టైర్-1)లో కంప్యూటర్ విధానంలోని ఆబ్జెక్టివ్ పరీక్షలో ఉత్తర్ణులైన నిర్ణీత సంఖ్యలోని అభ్యర్థులకు రెండో దశ (టైర్-2)లో పెన్ను, పేపర్ విధానంలో డిస్క్రిప్టివ్ పేపర్‌ను నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులవడానికి కనీస అర్హత మార్కులు 33 శాతం. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష.
ఎంత వేతనం?
ఎల్‌డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు పే లెవల్-2లో రూ.19,900-63,200.
పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ)కు పే లెవల్-4లో రూ.25,500-81,100.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)కు పేలెవల్-5లో రూ.29,200-92,300.
ఎంపికైన పోస్టును బట్టి మొత్తం మీద ముందుగా దాదాపు రూ.30వేల నుంచి రూ. 40 వేల వరకు నెలవారీ వేతనం ఉంటుంది.
పరీక్ష విధానం
మొదటి దశలో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాల్లో ఒక్కో దానిలో 25 ప్రశ్నలు, 50 మార్కులతో మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులతో ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలుంటాయి. ఈ పరీక్షకు ఒక గంట సమయం ఉంటుంది. అభ్యర్థి గుర్తించే ప్రతీ తప్పు సమాధానానికీ 0.5 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రెండో దశ డిస్క్రిప్టివ్ పరీక్షలో అభ్యర్థులు ఎస్సే, లెటర్, అప్లికేషన్, ప్రెసీ రైటింగ్ మొదలైనవి రాయాల్సి ఉంటుంది. మార్కులు 100. కాలవ్యవధి ఒక గంట. ఈ పరీక్షలను ఇంగ్లిష్ లేదా హిందీలో రాసుకోవచ్చు.
- ఇదీ చదవండి : ఎంబీబీఎస్ సీటు ఇస్తామని రూ.10 లక్షలు టోకరా
సబ్జెక్టులు - సిలబస్
మొత్తం సిలబస్‌ను నోటిఫికేషన్‌లోనే వివరంగా పేర్కొన్నారు. పరీక్షలో ప్రశ్నలు వచ్చే అవకాశమున్న టాపిక్స్ గురించి తెలుసుకుందాం.
> క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: దీనిలో అరిథ్‌మెటిక్ టాపిక్స్ అయిన నంబర్ సిస్టమ్, పర్సంటేజి, ఏవరేజి, రేషియో, ఇంటరెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, అలిగేషన్, మెన్సురేషన్లతోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీల నుంచి తేలికపాటి ప్రశ్నలు ఉంటాయి.
> జనరల్ ఇంటలిజెన్స్: దీనిలో వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్ రీజనింగ్‌లో కోడింగ్- డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫా- న్యూమరిక్ సిరీస్, సిలాజిజమ్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మొదలైనవాటి నుంచీ, నాన్-వెర్బల్ రీజనింగ్‌లో అనాలజీ, క్లాసిఫికేషన్, పేపర్ ఫోల్డింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ మొదలైనవాటి నుంచీ ప్రశ్నలు వస్తాయి.
> ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రహెన్షన్, ఒకాబులరీ, గ్రామర్ ఆధారంగా ఉండే ప్రశ్నల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎరర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, వర్డ్ సబ్‌స్టిట్యూషన్, డైరెక్ట్-ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్-పాసివ్ వాయిస్, ఇడియమ్స్- ప్రేజెస్, రీ అరేంజింగ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలు అడుగుతారు
> జనరల్ అవేర్‌నెస్: దీనిలోని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డులు, పుస్తకాలు- రచయితలు, ముఖ్యమైన రోజులు... మొదలైనవాటి నుంచి ఉంటాయి.
ఎస్‌ఎస్‌సీ నిర్వహించే సీజీఎల్ పరీక్షకూ, సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షకూ సిలబస్‌లో పెద్దగా మార్పు లేకపోయినా ప్రశ్నల స్థాయిలో మార్పు ఉంటుంది. సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షల ప్రశ్నలు తక్కువ స్థాయిలో సులువుగా ఉంటాయి.
- ఇదీ చదవండి : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
సన్నద్ధత ఎలా?
> మొదటి దశలో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు. అంటే దాదాపు మూడు నెలలకు పైగా సమయం ఉంది. ఇప్పుడు సన్నద్ధతను ప్రారంభించినా సమయం సరిపోతుంది. అయితే ఈ సమయానికంతా ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి.
> ఇంతకుముందు సబ్జెక్టులపై అవగాహన లేని అభ్యర్థులు ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లలోని అన్ని టాపిక్స్‌నూ 30-40 రోజులలో పూర్తి అయ్యేలా చూసుకోవాలి. వాటిలోని వివిధ స్థాయుల్లోని ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
> ఇంగ్లిష్ గ్రామర్‌ను బాగా చూసుకుని దాని ఆధారంగా వచ్చే వివిధ ప్రశ్నలను పూర్వ ప్రశ్నపత్రాల ఆధారంగా సాధన చేయాలి.
> జనరల్ అవేర్‌నెస్‌లోని టాపిక్స్‌ను కూడా చూసుకోవాలి.
> రోజుకు కనీసం 12-14 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించాలి.
> అభ్యర్థులు సబ్జెక్టులపై తమకున్న పట్టు/ అవగాహనను అనుసరించి సబ్జెక్టులవారీగా సమయాన్ని కేటాయించుకోవాలి.
> ప్రతిరోజూ టాపిక్స్ నేర్చుకుని సాధన చేయడంతోపాటు పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రాన్ని కూడా రాయాలి. అప్పుడే ఏయే సబ్జెక్టుల్లో ఏ మేరకు తమకు అవగాహన ఏర్పడిందో, ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది.
> దీంతో తగినవిధంగా తమ సన్నద్ధతలో మార్పులు చేసుకునే వీలు కలుగుతుంది.
ఇలా ప్రతిరోజూ తగిన సమయం కేటాయించుకుని పట్టుదలతో శ్రమిస్తే తప్పనిసరిగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు.
> ఎస్‌ఎస్‌సీ నిర్వహించే సీజీఎల్ పరీక్షకూ, సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షకూ సిలబస్‌లో పెద్దగా మార్పు లేకపోయినా ప్రశ్నల స్థాయిలో మార్పు ఉంటుంది. సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షల ప్రశ్నలు తక్కువ స్థాయిలో సులువుగా ఉంటాయి.
>రోజుకు కనీసం 12-14 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించాలి.
> ప్రతిరోజూ టాపిక్స్ సాధన చేయడంతోపాటు పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రాన్నీ రాయాలి. - డా. జి.ఎస్. గిరిధర్, డైరెక్టర్, రేస్