Rabi Crop remaining Quota Rice : గత యాసంగి సీజన్‌కు సంబంధించి మిగిలిన కోటా బియ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ పంపింది. ‘‘2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించిన వడ్లను మిల్లింగ్ చేయించి బియ్యం రూపంలో అందించడానికి మే 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 18న లేఖ రాసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం బియ్యాన్ని సరఫరా చేయడానికి మే 31 వరకు గడువు ఇస్తున్నాం. తదుపరి ఎలాంటి పొడిగింపులూ ఉండవు. మిగిలిన బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. ఇందులో రీసైక్లింగ్ బియ్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐలదే. మిగిలిన బియ్యాన్ని సరఫరా చేసేందుకు వీలుగా ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. మిల్లుల వారీగా బియ్యం సరఫరా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ఎఫ్‌సీఐ ఖరారు చేసిన ప్రొటోకాల్ ప్రకారం బియ్యం ఎప్పటివో రూఢీ చేసుకోవడానికి కాలపరీక్ష(ఏజ్ టెస్ట్) కూడా నిర్వహించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీయూష్ గోయల్‌కు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు : కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన బియ్యం ఇచ్చేందుకు గతంలో ఆరుసార్లు గడువు పొడిగించగా.. తాజాగా ఏడోసారి గడువు పొడిగించిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత వారం తాను రాసిన లేఖకు స్పందించి సానుకూల నిర్ణయం వెలువరించారంటూ కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ నిర్ణయం నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని గడువులోగా మిగిలిన బియ్యాన్ని అందించాలని కోరారు.
ఇవీ చదవండి: మామూళ్లతో అబ్కారీ శాఖ ఆదాయం మామూలుగా లేదుగా..
లక్షమందితో 'జనం గోస- భాజపా భరోసా'.. హాజరుకానున్న జేపీ నడ్డా
విశ్వక్సేన్ జోరు.. త్వరలోనే పాన్ ఇండియా సినిమా.. టైటిల్ ఇదే!