ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు, నీడలా ఆయన వెంట ఉన్న ఎర్ర గంగిరెడ్డిని... సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేయగా.. మూడో నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బుధవారం మధ్యాహ్నం గంగిరెడ్డిని పులివెందుల నుంచి కడపకు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకూ విచారించి... ఆ తర్వాత కడప రిమ్స్‌కు తీసుకెళ్లి కొవిడ్, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. ఇవాళ పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిందితుల పాత్రపై చర్చ
బుధవారం కూడా వివేకా ఇంట్లో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించిన సీబీఐ అధికారులు.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు, గేటు తీసుకొని ఎలా వెళ్లారు, బైక్‌పై ఎవరెవరు వచ్చారు, హత్య జరిగిన తర్వాత ఎలా పారిపోయారనే వివరాలను పరిశీలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో ఇంట్లో ఉన్న వివేకా కుమార్తె సునీతతో అధికారులు గంట పాటు మాట్లాడారు. కేసులో నిందితుల పాత్రపై చర్చినట్లు తెలుస్తోంది.
మరోసారి అరెస్ట్.?
2019 మార్చి 14న ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఇంటికి చేరుకున్న వివేకా.. మార్చి 15 తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. వివేకా ఇంటికి వచ్చినపుడు కారులో ఆయనతోపాటు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గంగిరెడ్డిని ఆయన ఇంటి వద్ద దించేసి... వివేకా తన ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు వ్యక్తులు వివేకా ఇంట్లోకి చొరబడి ఉంటారని సీబీఐ భావిస్తోంది. వారిలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కూడా ఉన్నారని సీబీఐ నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు ఇంట్లో సాక్ష్యాధారాలు చెరిపేశారనే అభియోగాలపై 2019 మార్చి 28నే సిట్ అధికారులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. అప్పట్లో 90 రోజుల పాటు జైల్లో ఉన్న గంగిరెడ్డి... ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు 302 సెక్షన్ కింద మరోసారి అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ.. సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. ఓ బ్యాంకు లాకర్‌లో మున్నాకు సంబంధించి రూ. 48 లక్షలు ఉన్నట్లు గత ఏడాది సీబీఐ గుర్తించింది. ఐపీ పెట్టిన వ్యక్తికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీసింది. ఆ డబ్బు తనదేనని మున్నా చెబుతుండగా.... దస్తగిరి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిర్ధరించేందుకు నార్కో పరీక్షలు చేయించాలని సీబీఐ భావిస్తోంది. ఉమాశంకర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై పులివెందుల కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇక సునీల్‌యాదవ్ రిమాండ్ గడువును ఈనెల 29 వరకూ కోర్టు పొడిగించింది.
ఇదీ చదవండి: Saidabad Incident: రైల్వేట్రాక్‌పై సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం