అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై ఇరువర్గాల వాదనలు వినాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. గతంలో ఇదే అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసినందున.. ప్రస్తుతం ఎలా విచారణ చేపట్టవచ్చునో వివరించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. విచారణ అర్హతపై జగన్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిస్థితులు మారిన నేపథ్యంలో మళ్లీ విచారణ చేయాలంటూ పలు హైకోర్టుల తీర్పులను ఉదహరించారు. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను 2014లో కొట్టివేసినా.. 2016లో విచారణకు స్వీకరించినట్లు గుర్తుచేశారు. జగన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.
ఇవాళ్టి విచారణకు పారిశ్రామికవేత్తలు అయోధ్యరామిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ శామ్యుల్, కృపానందం హాజరయ్యారు. జగన్‌తోపాటు విజయ్‌సాయిరెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరుకు సీబీఐ, ఈడీ కోర్టు అనుమతిచ్చింది.
ఇవీ చూడండి: "రేవంత్ నా ముద్దుల అన్నయ్యే కానీ.. 'ఏబీసీడీ'లు బాధించాయి"