రుణయాప్ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ ఈడీ అధికారిపై సీబీఐ బెంగళూరు విభాగం కేసు నమోదు చేసింది. బెంగళూరు ఈడీ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లలిత్ బజద్ 5 లక్షలు లంచం తీసుకున్నారన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబయికి చెందిన అపోలో ఫిన్వెస్ట్ బ్యాంకు ఖాతాను జప్తు నుంచి విడిపించేందుకు లంచం తీసుకున్నారని సీబీఐ అభియోగం.
అనుమతి లేకుండా యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి ఆ తర్వాత ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న పలు కంపెనీలపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కొన్ని కేసుల్లో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును బెంగళూరు ఈడీ విభాగం చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ముంబయికి చెందిన అపోలో ఫిన్వెస్ట్ కంపెనీ బ్యాంకు ఖాతాను ఈడీ అటాచ్ చేసింది.
ఈడీ సమన్ల మేరకు అపోలో ఫిన్వెస్ట్ ఎండీ మిఖిల్ ఇన్నన్ ఫిబ్రవరి 2న బెంగళూరులో ఈడీ విచారణకు హాజరయ్యారు. అదే రోజు రాత్రి మిఖిల్ ఇన్నన్కు ఈడీ ఆఫీసర్ లలిత్ ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను జప్తు నుంచి విడిపించేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. అదే రోజు రాత్రి బెంగళూరుకు చెందిన మన్వేందర్ భట్టి, రాజేంద్ర జైన్, సునీల్, హరీష్ ఇన్నాని సహకారంతో లలిత్ కు 5 లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.