ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. వ్యాపారం కోసం రుణం తీసుకుని రూ.237.84 కోట్లు దారి మళ్లించారనే ఫిర్యాదుపై...ఎంపీకి చెందిన ఇండ్ భారత్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టరల్లపై సీబీఐ దిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఎస్ఏఎంబీ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్. రవిచంద్రన్ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు....ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది.
నిందితులంతా కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం సహా పలు నేరాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ మోసం జరిగినట్లు...ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించామని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది. ఇండ్ భారత్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ డైరెక్టర్ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, ఇందిరా ప్రియదర్శిని ఇంకా ఇతర డైరెక్టర్లు సహా వివరాలు తెలియని మరికొంత మంది ప్రభుత్వోద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదీచదవండి: 'అమరావతిలో రాజధాని ఇష్టం లేక.. తప్పుడు కేసులు పెట్టారు'